ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. నేడు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు.
టిక్కెట్టు రుసుము రూ.3వేలు నిర్ణయించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శత చండీయాగం నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.4వేలు నిర్ణయించారు.
ఆన్‌లైన్లో కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ రుత్వికులు సమర్పిస్తారు.
ఆ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. వేకువ జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కనకదుర్గానగర్‌లో లడ్డు, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తారు.
అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు._
#########
ఐదవ రోజు – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం ..!
దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో విరాజిల్లుతూ పూజలందుకుంటారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది.
త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని వ్యవహరిస్తారు.
త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
* స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.
* సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
* పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.
శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి
ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే
లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.
శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహిస్తుంది. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా పిలవబడేది. శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించిన అనంతరం అమ్మ పరమశాంత రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.
పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో, భక్తి పావనాన్ని చిందే చెరుకు గడను చేతపట్టుకొని, శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శినమిస్తుంది. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీచక్రానికి కుంకుమార్చన – లలితా అష్టోత్తరము చేసి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రము 108 మార్లు జపిస్తే మంచిది. పులిహోర, పెసర బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే
కామేశ్వర్యై చ ధీమహి
తన్నోబాలా ప్రచోదయాత్.
పూజా ఫలితం:- అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.
#############