ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే తీసుకు వెళ్లి అందించేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరప గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగులను సీఎం పలకరించారు. అంకితభావంతో పనిచేయాలని ఉద్యోగులకు జగన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఒక్కోచోట 12 మంది వరకూ ఉద్యోగులను నియమించింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. ‘మహాత్మాగాంధీ అంటే అహింసా, సత్యాగ్రహం పదాలు గుర్తుకువస్తాయి. మహాత్ముడి ఆశయాలను అందరం స్మరించుకోవాలి. పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాం. ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాం. ఈ నాలుగు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెక్కడా జరిగి ఉండదు. తూర్పుగోదావరి జిల్లాలోనే 44,198 ఉద్యోగాలు ఇవ్వగలిగామంటే అది ఓ రికార్డు. ప్రతి గ్రామ వాలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి ప్రభుత్వ పథకం నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వస్తుంది. గ్రామ సచివాలయాల పక్కనే దుకాణాలు తీసుకొస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆయా దుకాణాల్లోనే అందుబాటులో ఉంటాయి. ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలకు సేవకులమని అంతా గుర్తుంచుకోవాలి. పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వసతులు కల్పిస్తాం. పాఠశాలల పరిస్థితిపై నాడు – నేడు ఫొటోలు తీసి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. 33శాతంగా ఉన్న నిరక్షరాస్యత నుంచి ఐదేళ్ల తర్వాత సున్నా శాతం కావాలి. రాష్ట్రంలో సంపూర్ణ మార్పు దిశగా ఆలోచనలు చేస్తున్నాం. గతంలో రాష్ట్రంలోని గ్రామాల్లో 43వేల బెల్ట్‌షాపులు ఉండేవి. ఊళ్లల్లో మినరల్ వాటర్ ఉందో లేదో తెలియదు గానీ.. మద్యం దుకాణాలు మాత్రం వీధి చివర.. గుడి పక్కన..బడి పక్కన.. ఎక్కడపడితే అక్కడ కన్పించే పరిస్థితి ఉండేది. కానీ అవేమీ లేకుండా చేశామని ఈ గాంధీ జయంతి రోజున సగర్వంగా చెబుతున్నా’’ అని సీఎం జగన్ అన్నారు.
మాది ప్రజాసేవక ప్రభుత్వం
Related tags :