DailyDose

ఉప-ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపై కులవివాదం-తాజావార్తలు-10/04

Caste Identification Case On Andhra Deputy Chief Minister Pushpa Srivani-Telugu Breaking News-10/04

* ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని మరోసారి కులవివాదం చుట్టుముట్టింది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగుమహేశ్‌, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. బుట్టాయగూడెంలో జన్మించిన పుష్పశ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా పరిశీలన కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.

* ఆర్టీసీ కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించామని.. సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన ఆర్టీసీ కార్మికులను హెచ్చరించారు. ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు విఫలమైన నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ నేపథ్యంలోని ఐఏఎస్‌ అధికారుల కమిటీ మీడియాతో మాట్లాడింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని.. ప్రభుత్వం తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరిస్తుందని సోమేశ్‌కుమార్‌ చెప్పారు.

* తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్క్‌లో సమీర్, రాణి అనే రెండు తెల్ల పులులు ఐదు పులిపిల్లలను జన్మనిచ్చాయి. ఈ ఐదింటిలో మూడు మగ పిల్లలు కాగా రెండు ఆడ పిల్లలు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి జూపార్క్‌ను సందర్శించి పులిపిల్లలను పరిశీలించారు. మగ పులిపిల్లలకు వాసు, సిద్ధాన్‌, జగన్‌ అని, ఆడ పులిపిల్లలకు విజయ, దుర్గ అని మంత్రి నామకరణం చేశారు. కార్యక్రమంలో జూపార్క్‌ అధికారులు ప్రదీప్ కుమార్, నళినీమోహన్ తదితరులు ఉన్నారు.

* తెలంగాణలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని.. ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జీవన్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో రవాణా వ్యవస్థలో ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గిస్తామని కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఈ ఐదేళ్ల కాలంలో ప్రైవేటు వాహనాలు అదనంగా మరో 5 శాతం పెరిగాయన్నారు.

* శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో అంతరిక్ష వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను ఎంఆర్‌ఆర్‌ కోఛైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో భారత్‌ ఎంతో ముందంజలో ఉందన్నారు. దేశంలో అంతరిక్ష పరిశోధనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని చాలా మంది ప్రశ్నిస్తుంటారని ఆయన అన్నారు.

* తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో బంధువుల వద్ద రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. ఏసీబీ సోదాలు ఎందుకు జరుగుతున్నాయో తర్వాత చెబుతానని మధుసూదన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

* హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని జనసేన కార్యాలయానికి వెళ్లి కోరినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని కోరిన వెంటనే జనసేన ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని వీహెచ్‌ అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అందుబాటులో లేరని.. ఆయన రాగానే కచ్చితంగా మద్దతు ప్రకటిస్తారని వీహెచ్‌ ధీమా వ్యక్తం చేశారు. జనసేన మద్దతుతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

* దేశంలో చమురు ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో పెట్రోల్‌ ధర లీటరుకు 18 పైసలు తగ్గగా, చెన్నైలో 19 పైసలు తగ్గింది. ఇక డీజిల్‌ విషయానికి వస్తే దిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో లీటరుకు 8 పైసలు తగ్గగా, చెన్నైలో 9 పైసలు తగ్గింది. సౌదీ చమురు నిల్వలపై దాడుల అనంతరం చమురు ధరలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే పండగ సీజన్‌లో వీటి ధరలు తగ్గడం వినియోగదారులకు కాస్త ఉపశమనమేనని చెప్పాలి.

* ఫిబ్రవరి 27న భారత్‌-పాక్‌ మధ్య వైమానిక పోరు జరుగుతున్న సమయంలో బద్గాం సమీపంలో ఎమ్‌ఐ-17 వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే అది మన తప్పిదం వల్లే జరిగిందని ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వైమానిక దళాధిపతి ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదూరియా అంగీకరించారు. ఐఏఎఫ్‌ ప్రయోగించిన క్షిపణి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. దీనిపై ఏర్పాటు చేసిన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ పూర్తయిందన్నారు.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ప్రకటించిన కీలక వడ్డీరేట్లు తగ్గింపు ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్‌ 433.56 పాయింట్లు నష్టపోయి 37,673.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 139.25 పాయింట్లు కోల్పోయి 11,174 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ ప్రకటన తర్వాత నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 37,633 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ స్వల్పంగా కోలుకుంది.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో నూతన వైద్య కళాశాలను నిర్మించనున్నారు. అంతేకాకుండా వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

* హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో 1.30 గంటలకు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 ప్రాంతంలో ప్రధాని మోదీతోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగే అవకాశం ఉంది.

* కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఐదో రోజున మోహినీ అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగానూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.

* అనంతపురం జిల్లా మల్లిఖార్జున పల్లిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుపై విద్యుత్‌ స్తంభం పడటంతో ప్రయాణికులు కేకలు వేస్తూ కిందికి దూకేశారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.

* ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ప్రస్తుతం 5.40శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి 5.15శాతంగా నిర్ణయించింది. రివర్స్‌ రెపో రేట్‌ను 4.90శాతం, బ్యాంక్‌ రేట్‌ను 5.40శాతంగా నిర్ణయించారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీని 6.9శాతం నుంచి 6.1శాతానికి, 2020-21 సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్బీఐ 7.2కు సవరించింది.

* కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌కు యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 58దేశాలు మద్దతిస్తున్నాయని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించి తప్పులో కాలేసిన విషయం తెలిసిందే. నిజానికి యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఉండేది 47 దేశాలు మాత్రమే. దీనికి పాక్‌ మంత్రి మహ్మద్‌ ఖురేషీ సైతం మద్దతు పలికారు. దీనిపై అదే దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వివరణ కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఖురేషీ.. ఎవరి అజెండాతో పనిచేస్తున్నారంటూ చిందులువేశారు. ‘‘ఐరాసలో మనకు మద్దతిచ్చిన సభ్యుల జాబితా గురించి మీరు మాకు చెబుతారా’’ అంటూ జర్నలిస్టుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

* నియంత్రణ రేఖ వెంబడి భారీ అలజడికి పాక్‌ పన్నాగం పన్నినట్లు కీలక సమాచారం అందడంతో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పాక్‌సైన్యం, జమాత్‌ ఉల్‌ అల్‌ హదీప్‌ సంస్థ సంయుక్తంగా 4 వేల మంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర నిఘా బృందం గుర్తించింది. శిక్షణ పొందిన వారు నియంత్రణ రేఖదాటి భారత్‌లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 17, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.88గా ఉంది.