దాదాపు ఏడు దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేసి గెలుచుకున్న నిజాం నవాబు నిధులను ఆయన వారసులు 120 మంది పంచుకోనున్నారు. హైదరాబాద్ నిజాం నవాబుకు చెందిన..లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోగల 3.5 కోట్ల పౌండ్లు (సుమారు రూ.307 కోట్లు)ఆయన వారసులకే దక్కుతాయని లండన్ కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన ఆ నిధులు ఆయన వారసులుగా చెప్పుకుంటున్న యువరాజులు, భారతదేశానికి మాత్రమే పొందే హక్కు ఉన్నదని లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌కు చెందిన జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సొమ్మును ఎవరెవరు పంచుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నిధుల కోసం నిజాం మనుమలు ముకరం జా, ముఫఖ్కం జా భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేశారు. ఆ తరువాత నిజాం ఎస్టేట్‌గా ఏర్పడిన 120 మంది నిజాం వారసులు కూడా ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. వీరే కాకుండా నిజాం కుటుంబ సంక్షేమ సంస్థకు నేతృత్వం వహిస్తున్న నిజాం మరో మనుమడు నజఫ్ అలీఖాన్ కూడా కేసులో హక్కుదారుగా చేరారు. వీరందరినీ కలిపి ఇప్పుడు నిజాం ఎస్టేట్‌గా పరిగణిస్తున్నారు.బ్యాంక్‌లోని నిధుల విషయంలో నిజాం ఎస్టేట్ భారత ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారం కేసులో హక్కుదారులుగా ఉన్న వారందరూ ఆ సొమ్మును పంచుకోవాలి. అయితే భారత ప్రభుత్వం కూడా తన వాటాను కోరుతున్నదా లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో భారత ప్రభుత్వం డబ్బు కోసం కన్నా ప్రతిష్ఠ కోసమే పోరాడినట్టు హైదరాబాద్ చరిత్రకారులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌కు భంగపాటు కలిగించాలన్న పట్టుదలతోనే హరీశ్ సాల్వే వంటి ప్రముఖ న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించినట్టు చెప్తున్నారు. ఇదిలాఉండగా, కోర్టు తీర్పు పేదరికంలో మగ్గుతున్న పలువురు నిజాం వారసులకు బంపర్ లాటరీలా తగిలిందని అంటున్నారు. నిజాం వారసులలో రెండు మూడు కుటుంబాలు తప్ప.. దాదాపు అందరికీ రెండు పూటలు గడవడం కూడా కష్టంగా ఉన్నట్టు తెలుస్తున్నది. నిజాం వారసులు 120 మంది తనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారని నజఫ్ అలీఖాన్ గురువారం హైదరాబాద్‌లో చెప్పారు. ముకరంజా, ముఫఖ్కం జాతోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి డబ్బు పంపిణీపై చర్చించుకుంటామని తెలిపారు. లండన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసుకొనేందుకు పాకిస్థాన్‌కు నాలుగు వారాల గడువు ఉన్నదని పేర్కొన్నారు.
నిజాం నగలు 120మంది పంచుకుంటారా?
Related tags :