హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు ప్రధానితో సమావేశమై చర్చలు జరిపారు. 22 అంశాలకు సంబంధించిన లేఖలను మోదీకి కేసీఆర్ అందజేశారు. ప్రధానిగా మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో కేసీఆర్ భేటీ కావడం ఇదే తొలిసారి.
ప్రధానికి కేసీఆర్ నివేదించిన అంశాలివే!
* ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలైనప్పటికీ.. ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి.
* నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.
* తెలంగాణ హైకోర్టులో జడ్డిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.
* రాష్ట్రంలో ఐఐఎం నెలకొల్పాలి.
* తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) మంజూరు చేయాలి.
* హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)ఏర్పాటు చేయాలి.
* అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు రాష్ట్రంలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
* రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలి.
* నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
* బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి
* జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు విడుదల చేయాలి.
* తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి.
* పీపీపీ పద్ధతిలో కరీంనగర్లో ఐఐఐటీ నెలకొల్పాలి.
* తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బిసిలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
* పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
* హైదరాబాద్ – నాగపుర్, వరంగల్ -హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలి.
* వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పీఎంజీఎస్‌వై ద్వారా రూ.4వేల కోట్లు కేటాయించాలి.
* వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా వందశాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
* సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి.
* వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ.వెయ్యి కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలి.
* రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూములను అప్పగించాలని కేసీఆర్ రాజ్‌నాథ్‌ను కోరారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కేసీఆర్ భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు.