ఎవరు ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. అవి ఇచ్చ, జ్ఞాన, క్రియా శక్తులు. చేయాలన్న కోరిక, చేసే విధానాన్ని తెలుసుకోవడం, చేయడం… ఇదీ ఆ శక్తులకు నిర్వచనం. వీటికి ప్రతీకలు సరస్వతి, లక్ష్మి, దుర్గ. ఈ అమ్మలకు మూలశక్తి పరాశక్తి. ఆమెకు అభివ్యక్త రూపాలు ఈ ముగ్గురమ్మలు. ఆ ఆదిపరాశక్తికి అనేక రూపాలు. శరన్నవరాత్రులలో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు.జగత్తులో పరాశక్తి పలు రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ పరదేవాతకృతులే. ఆయా ఆకృతులను ఆరాధించే పద్ధతులను మన ప్రాచీన ఋషులు మనకు అందించారు. శరదదృతువు ఆరంభంలో ఆ మహా చైతన్య శక్తిని ‘అమ్మా!’ అంటూ పిలిచి, పూజించే నవరాత్రి ఉత్సవాల్లో దేశమంతా పులకించి పునీతం అవుతుంది.
‘త్వమేవ కారణం కార్యం క్రియాజ్ఞానం త్వమేవహి
త్వామంబ న వినాకించిత్ త్వయి సర్వం ప్రతిష్ఠితం’ అంటారు శ్రీ శంకర భగవత్పాదులు. అంటే ‘‘అమ్మా! నీవే కారణభూతురాలవు. కార్యరూపిణివి. క్రియారూపిణివి. నువ్వే జ్ఞానం. నువ్వు లేకుంటే ఏదీ లేదు. నీలోనే అంతా ఉన్నది’’ అని భావం.
ఆదిశక్తి అభివ్యక్తి రూపమే ఇంద్రకీలాద్రి (విజయవాడ) పై స్వయంభువుగా వెలసిన దుర్గాదేవి. ఆమెను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిగా పద్మ, బ్రహ్మ బ్రహ్మవైవర్తిక పురాణాలు, ఇతిహాసాలు, దేవీ భాగవతం, దుర్గా సప్తశతి బహుదా ప్రస్తుతించాయి. సజ్జన రక్షణ, దుర్జన శిక్షణ, ధర్మ సంరక్షణలే ధ్యేయంగా ఆమె అవతరించిందని ఆదిశంకరులు వివరించారు.
**ఇంద్రకీలాద్రిపై ఆదిదంపతులు
దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించి, కీలుడు అనే పేరున్న పర్వతుడికి ఇచ్చిన వరం కారణంగా, ఇంద్రునికి ఇచ్చిన మాట ప్రకారంగా పరాశక్తి ఇంద్రకీలాద్రిపై వెలసింది. తోడుగా పరమేశ్వరుడు కూడా బ్రహ్మ సంకల్పంతో మల్లేశ్వరుడిగా కొలువయ్యాడు. వీరిద్దరూ పూజలు అందుకుంటూ, భక్తులను అనుగ్రహిస్తున్నారు. దుర్గామాతకు నిత్యోత్సవాలు, పఖోత్సవాలు, మాసోత్సవాలతో నిత్యం దుర్గమ్మ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు దేశప్రజలను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ ఉత్సవ దినాల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్ర యంత్రాన్ని (మేరువు) పసుపు, కుంకుమలతో అర్చిస్తూ, దుర్గామాతను శాస్త్రాలలో
వివరించినట్టు రోజుకొక రూపంలో సర్వాంగ సుందరంగా
అలంకరిస్తారు. నవరాత్రుల అనంతరం పదో రోజైన విజయ
దశమి రోజున సంధ్యాకాలంలో శ్రీకనకదుర్గాదేవిని హంస
వాహనంపై నిలిపి, కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.
**ప్రాంతం ఏదైనా అదే సరదా!
దేశంలోని అన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకొనే పండుగ దసరా. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఈ సంబరాలను నిర్వహించినా, ఉత్సాహం, ఉత్తేజం స్థాయి ఒకేలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబ, ఆలంపురం జోగులాంబ, శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ, వరంగల్ భద్రకాళి, వేములవాడ రాజరాజేశ్వరి, ద్రాక్షారామం మాణిక్యాంబ… ఇలా సుప్రసిద్ధమైన అనేక ఆలయాల్లో దేవీ నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందురోజు నుంచీ నిర్వహించే బతుకమ్మ పండుగ ప్రకృతికీ, మానవుడికీ మధ్య ఉండే సంబంధాన్ని చాటిచెప్పే గొప్ప వేడుక. ఇక కర్ణాటకలోని మైసూరులో నిర్వహించే దసరా ఉత్సవాలకు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది.
విజయదశమి రోజున చాముండేశ్వరీ దేవిని ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. అంగరంగవైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు తరలివస్తారు. పశ్చిమబెంగాల్‌లో వాడవాడలా దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. కోల్‌కతాలో కాళీమాత ఉత్సవాల్లో భక్తుల ఉత్సాహం ఆకాశాన్ని అంటుతుంది. ఉత్సవాలు ముగిశాక మంటపాల్లోని అమ్మవారి విగ్రహాలను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఉత్తరాదిన విజయదశమి సందర్భంగా నిర్వహించే రామ్‌లీలా ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణదహనం జరుపుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.
**అరిషడ్వర్గాలపై విజయం
విజయదశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు. దుష్టశక్తులపై దైవశక్తి పైచేయి సాధించిన రోజు. పురాణపరంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ దసరా. మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజు, రావణుణ్ణి శ్రీరాముడు వధించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. జమ్మిచెట్టు మీద దాచిన తమ ఆయుధాలను పాండవులు తీసుకున్న రోజు కూడా విజయదశమేనని మహాభారతం పేర్కొంటోంది. అధర్మానికి నాశనం తప్పదనీ, ధర్మమార్గంలో నడవడమే శ్రేయోదాయకమనీ, దానికోసం మానవులు తమలోని అరిషడ్వర్గాలను… అంటే కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అనే ఆరు శత్రువులను జయించాలనీ పెద్దల ఉపదేశం. అంతర్గతంగా ఉన్న ఈ శత్రువులే దానవుల్ని నాశనం చేశాయి. కాబట్టి ధర్మాచరణతో వాటిని తుదముట్టించాలనే అంతరార్థాన్ని విజయదశమి చాటి చెబుతోంది.
దసరా లక్ష్యం…శక్తి ఆరాధన….దుష్ట మర్దన
Related tags :