DailyDose

రోజా మేడమ్ జీతం నెలకు ₹3.82లక్షలు-తాజావార్తలు-10/05

APIIC Chairman Roja Salary Is Set At 3.82Lakhs-Telugu Breaking News Today-10/05

* ఏపీ ఐ ఐ సీ చైర్పర్సన్ హోదాలో ఉన్న రోజాకు జీతభత్యాల క్రింద నెలకి 3.82 లక్షల రూపాయలు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం. వాహన సౌకర్యానికి ₹60వేలు. నివాసం సౌకర్యానికి ₹50వేలు. మొబైల్ ఫోన్ కోసం ₹2వేలు. వ్యక్తిగత సిబ్బందికి ₹70వేలు.

* గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులోభాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా, సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా, ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా, మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్‌-2,గా, ఉద్యానశాఖ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడుగా, పట్టుపరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుడుగా, డిజిటల్‌ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6 గా, మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

* తాడేపల్లిగూడెంలో ఈ నెల 6 వ తేదీన నట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణ చిరంజీవి చేతుల మీదుగా జరుగుతుందని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు.

* పాకిస్థాన్‌లో అధ్యక్ష, ప్రధాని పదవులు కేవలం ముస్లింలకు మాత్రమేనని ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ స్పష్టం చేసింది. ముస్లిమేతరులు వాటిని అధిష్ఠించడానికి అనర్హులని పేర్కొంది. ముస్లిమేతరులు కూడా ఈ పదవులను చేపట్టేందుకు వీలుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన క్రిస్టియన్‌ ఎంపీ నవీద్‌ ఆమిర్‌ జీవా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతుండగా, ప్రభుత్వం దానిని అడ్డుకుంది.

* తిరుచ్చిలోని లలిత జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దొంగతనం కేసులో ఓ నిందితుడు పోలీసులకు చిక్కాడు. తిరువారూర్ సమీపంలోని విళమల్ అడియక్కమంగలం చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి బైక్‌పై వస్తున్న ఇద్దరు దొంగలు వెనక్కి తిరిగి పరారయ్యారు. గుర్తించి అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించారు. కిలోమీటరు దూరం వెంబడించిన తర్వాత ఓ దొంగ అట్టపెట్టతో పోలీసులకు పట్టబడ్డాడు. అందులో 4.5 కిలోల బంగారు నగలు కనిపించడంతో పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని తిరువారూర్‌కు చెందిన మణికంఠన్ (32)గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో దొంగ కూడా అదే గ్రామానికి చెందిన సురేశ్ అని పోలీసులు తెలిపారు.

* అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

* తెలంగాణలో పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కృష్ణా జిల్లా నుంచి అధికారులు తెలంగాణకు 100 బస్సులను పంపారు.
విజయవాడ సిటీ సర్వీస్‌లతో పాటు.. ఇతర డిపోల నుంచి కొన్ని సర్వీస్‌లను హైదరాబాద్‌కు నడుపుతున్నామని కృష్ణా జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

* బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఢిల్లిలోని హైదరాబాద్‌ హౌస్‌లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నారు.