ScienceAndTech

ఢిల్లీ మెట్రో రైలు ప్రకంపనలు

Delhi Metro Train Vibrations Causing Public Panic

ఢిల్లీలో మెట్రో రైలు కార్పొరేషన్(డిఎంఆర్‌సి)కు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. నివాస కాలనీలపై నుంచి వెళ్లే మెట్రో రైలు శబ్దాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా భూగర్భంలో తమ ఇళ్ల కింద నుంచి వెళ్లే మెట్రో రైళ్ల ఏర్పడుతున్న ప్రకంపనలతో మరి కొందరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్లలో శబ్దాల సమస్యను, అండర్‌గ్రౌండ్ కారిడార్లలో ప్రకంపనల సమస్యను తగ్గించడానికి డిఎంఆర్‌సి నిపుణుల సలహాలను తీసుకుంటోంది. ఇందు కోసం సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిఎస్‌ఐఆర్-సిఆర్‌ఆర్‌ఐ)ల మార్గదర్శకాలను తీసుకునేందుకు డిఎంఆర్‌సి సంప్రదించింది. ఢిల్లీలో మొత్తం 181 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇవి కరోల్ బాగ్, తూర్పు కైలాశ్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలలో నివాస ప్రాంతాలపై నుంచి వెళతాయి. అలాగే, 68 అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లు ఉండగా ఇవి దక్షిణ, సెంట్రల్ ఢిల్లీలో ప్రధానంగా ఉన్నాయి. సొరంగ మార్గంలో వెళ్లే ఈ రైళ్ల ప్రకంపనలకు ఇళ్లు బీటలు వారుతున్నట్లు సాకేత్, హౌజ్ ఖాస్, బేగంపూర్, షాహబాద్ మొహమ్మద్‌పూర్, సర్వ్‌ప్రియ విహార్ నివాసులు డిఎంఆర్‌సి ఫిర్యాదు చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ మెట్రో రైళ్ల వల్ల ఏర్పడుతున్న ప్రకంపనల గురించి మాజీ ఎంపి, బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి సైతం గతంలో డిఎంఆర్‌సికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మెట్రో రైళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు ఏవీ ప్రపంచవ్యాప్తంగా లేవంటున్నారు డిఎంఆర్‌సి ఇడి అనూజ్ దయాల్. సిఆర్‌ఆర్‌ఐ ఇచ్చే మార్గదర్శకాలతో మెట్రో రైళ్ల వల్ల ఏర్పడుతున్న శబ్ద, ప్రకంపనల సమస్యను నివారించగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.