అతడికి అక్షరజ్ఞానం లేదు. కానీ.. ప్రణాళిక వేశాడంటే కోట్లు కొల్లగొట్టడమే! చోరీసొత్తుతో ఏకంగా సినిమాలు కూడా తీసేశాడు. తిరుచ్చి లలితా జ్యూవెలరీ చోరీ ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మురుగన్ చరిత్ర ఇది. ఈ చోరీకేసును విచారిస్తున్న పోలీసు అధికారుల సమాచారం మేరకు తమిళనాడులోని తిరువారూర్‌కు చెందిన మురుగన్ అలియాస్ బాలమురుగన్ గోడలకు కన్నాలు వేసి చోరీచేయడంలో సిద్ధహస్తుడు. ఏనాటికైనా కోటీశ్వరుడు కావాలని అడ్డదారి తొక్కి బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డాడు. తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అతడిపై పలు కేసులున్నాయి. 18 ఏళ్లకే సొంతింట్లోని టేప్‌రికార్డరును ఎలా దొంగిలించాలనే విషయంపై ఆలోచించాడు. అక్కడ్నుంచి అతడి చోరీల ప్రస్థానం కొనసాగింది. 2008లో ముఠాను ఏర్పాటుచేసి బెంగళూరులో తొలిసారి భారీ చోరీ చేశాడు. 2011లో ఓ చోరీ కేసులో బెంగళూరు పోలీసులు అతడిని అరెస్టుచేయగా బెయిల్‌పై విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాం మర్చాడు. అక్కడ సొంతిల్లు కొన్నాడు. సినిమాలంటే ఇష్టపడే ఇతను సొంతంగా సినిమా తీయాలనుకున్నాడు. రూ.50 లక్షలతో ‘బాలమురుగన్ ప్రొడక్షన్’ పేరిట సినీనిర్మాణ కంపెనీ ప్రారంభించాడు. తెలుగులో ‘మనసా వినవే’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అందులో తన అక్క కుమారుడు సురేశ్‌ను నటింపజేశాడు. లలితా జ్యూవెలరీ చోరీకేసులో పోలీసులు గాలిస్తున్న సురేశ్ ఇతనే. ఆ చిత్రం 70% నిర్మాణం పూర్తయ్యాక ఓ చోరీకేసులో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీసులు 2016 ఫిబ్రవరిలో మురుగన్‌ను అరెస్టుచేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ఆత్మ’ అనే మరో చిత్ర నిర్మాణం మొదలుపెట్టాడు. 2014 నవంబరు 16న చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యంలోని సప్తగిరి గ్రామీణబ్యాంకులో రూ.2 కోట్లకు పైగా నగదు, పెద్దమొత్తంలో నగలు దొంగిలించాడు. 2014 అక్టోబరులో తెలంగాణలోని ఘట్‌కేసర్ గ్రామీణబ్యాంకులో రూ.35 లక్షలు దోచుకున్నాడు. 2015లో సైబరాబాద్ పోలీసులు అతడిని అరెస్టుచేసి భారీ మొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని పలు బ్యాంకుల్లోనూ దోపిడీ చేశాడు. 2017లో చెన్నై అన్నానగర్, తిరుమంగలం ప్రాంతాల్లోని 17 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో మురుగన్ ముఠాను అరెస్టుచేసి 5 కిలోల బంగారాన్ని గ్రేటర్ చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను అనారోగ్యం వల్ల నడవలేని స్థితిలో ఉన్నాడని, ఓ వ్యాన్‌లో సంచారజీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు చెప్పారు. స్వస్థలం తిరువారూర్‌కు వచ్చిన ప్రతిసారీ అక్కడివారికి భారీగా ఆర్థికసాయం చేస్తాడని, అందువల్ల అతడి గురించి పోలీసులకు ఆ గ్రామస్థుల నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
లలితా జ్యువెలర్స్ దొంగ తెలుగు సినిమాకు నిర్మాత
Related tags :