Health

President Trump’s Straight Sixer Shot On 35K Indians’ Face

President Trump's Straight Sixer Shot On 35K Indians' Face

అమెరికాకు వలస రావాలని ప్రయత్నించే వారికి ఆరోగ్య బీమా లేకపోతే తిప్పలే. ఈ బీమా లేనివారు, వైద్య ఖర్చుల్ని సొంతంగా భరించగలమని నిరూపించుకోలేనివారు ‘ఇమ్మిగ్రెంట్‌ వీసా’ ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు. బీమా, లేదా ఆర్థిక పరపతిపై ఏదో ఒక ఆధారాన్ని వీసా పరిశీలన పూర్తయ్యేలోగానే చూపించడం అనివార్యం. ఆ తర్వాత, లేదా అమెరికాలో ప్రవేశించాక వీటిని ఇస్తామంటే అంగీకరించబోరు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సమీప కుటుంబ సభ్యుల ద్వారా అమెరికాకు ఏటా రమారమి 35 వేల మంది భారత్‌ నుంచి వలస వస్తుంటారని అంచనా. అధికారిక వీసాలు, అక్రమ వలసలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ట్రంప్‌ తాజా నిర్ణయంతో వీరి ఆశలపై నీళ్లు జల్లినట్లవుతుందని భావిస్తున్నారు. నవంబరు 3 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని శ్వేతసౌధంలోని వలస విభాగ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో వలసదారులు స్థిరపడడాన్ని మరింత క్లిష్టతరం చేయడానికే తాజా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అమెరికాలో అడుగుపెట్టిన 30 రోజుల్లోగా ‘ఆమోదిత ఆరోగ్య బీమా’ను పొందడం వలసదారులకు ఇక తప్పనిసరి. లేదంటే సహేతుకమైన వైద్య ఖర్చుల్ని భరించగల ఆర్థిక వనరులనైనా కలిగి ఉండాలి. అమెరికా పౌరులతో పోలిస్తే చట్టబద్ధ వలసదారులకు ఆరోగ్య బీమా కవచం తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా పౌరుల ఆరోగ్య రక్షణ ప్రయోజనాలను పరిరక్షించడానికి నూతన ఉత్తర్వులు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది. పరిహారం రాని ఆరోగ్య ఖర్చుల వల్ల గత పదేళ్లలో ఏటా 35 బిలియన్‌ డాలర్లకు పైగా వ్యయమైనందువల్ల కొత్త ఆంక్షలు తప్పడం లేదని పేర్కొంటోంది. తాత్కాలిక పర్యటన, పని సంబంధిత వీసాల కంటే ఇమ్మిగ్రెంట్‌ వీసా భిన్నమైనది. అమెరికా పౌరులు ప్రాయోజితం (స్పాన్సర్‌) చేసినవారికి, గ్రీన్‌కార్డుదారులు స్పాన్సర్‌ చేసినవారికి వీటిని మంజూరు చేస్తారు.