కొత్త టెక్నాలజీ… ఈ మాట వినగానే చాలామందికి దడ! ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఆందోళన చెందుతుంటారు. కొన్ని సంస్థలకూ ఇదే భయం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి భయాందోళనలున్నాయి. కానీ భారత్ ఇందుకు అతీతమైనది! ఎన్ని ప్రతికూలతలున్నా…నూతన సాంకేతికత పట్ల భారతీయులు అత్యంత సానుకూలంగా స్పందించి, సాదరంగా ఆహ్వానిస్తున్నారని ప్రపంచ ఆర్థిక సంస్థ వెల్లడించింది. నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడు రెండు మార్పులు జరుగుతాయి. ఒకటి: పాత టెక్నాలజీ మూలనపడుతుంది. దాని ఆధారంగా పనిచేసే ఉద్యోగులు అభద్రతా భావానికి లోనవుతారు. ఇక రెండోది: కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అయితే… ప్రపంచ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీ పట్ల అత్యంత సానుకూలత వ్యక్తం చేసే వారిలో భారతీయులు ఉండటం విశేషం. సాంకేతికత మారినప్పుడల్లా తమకు ఉద్యోగాలు వస్తాయన్న సానుకూల దృక్పథం వారిలో వ్యక్తమవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మంది కొత్త టెక్నాలజీకి జైకొడుతుండటం విశేషం.
‘ఇండియా ఎకనామిక్ సమ్మిట్-2019’ నేపథ్యంలో… వాణిజ్య సాఫ్ట్‌వేర్ సంస్థలు శాప్, క్వాల్ట్రిక్స్‌లు ఇటీవల అభిప్రాయ సేకరణ చేపట్టాయి. 29 దేశాలకు చెందిన 10,000 మంది ఇందులో పాల్గొన్నారు. మిగతా దేశాలవారితో పోల్చితే… వాతావరణ శాస్త్రవేత్తలను, అంతర్జాతీయ సంస్థలను భారతీయులే అధికంగా విశ్వసిస్తున్నట్టు తేలింది. కేవలం డబ్బుల కోసమే సాంకేతిక సంస్థలు పుట్టుకొస్తున్నాయన్న భావనను మూడింట రెండొంతుల మంది భారతీయులు తోసిపుచ్చడం విశేషం. వ్యక్తిగత సంబంధాల బలోపేతానికి, సమాజ అభ్యున్నతికి, ఉద్యోగ కల్పనకు సాంకేతిక ఎంతో తోడ్పడుతున్నట్టు బలంగా నమ్ముతున్నామని వారు వెల్లడించారు. కొత్త టెక్నాలజీ తమకు మంచే చేస్తుందని సర్వేలో పాల్గొన్న భారతీయులు అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. కొత్త సాంకేతికత కారణంగా ఉద్యోగాలను పోగొట్టుకునే పరిస్థితులు తాత్కాలికంగా ఎదురైనా… ఆర్థిక వ్యవస్థ బలోపేతమై త్వరలోనే మరిన్ని కొత్త కొలువులు వస్తాయని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.