ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సేకరించిన రొయ్యల ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమీకరించే బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్ట్‌ను వాల్‌మార్ట్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల సరఫరాదార్ల నుంచి వాల్‌మార్ట్ ద్వారా యూఎస్‌లోని శామ్స్ క్లబ్ ప్రాంతాలకు రొయ్యల ఉత్పత్తులు పెద్దమొత్తంలో రవాణా అవుతున్నాయి. ఈ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రొయ్యల ఉత్పత్తులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయటం, వినియోగదార్లకు ఆయా ఉత్పత్తుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచటం ఈ పైలెట్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయోత్పత్తుల్లో రొయ్యల వాటా ఎంతో అధికం. ఇందులో 46 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకే ఎగుమతి అవుతున్నాయి. మనదేశంలో రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఉత్పత్తిదార్లు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే చూడాలని, అమెరికా పర్యవేక్షణ- మార్గదర్శకాలకు అనుగుణంగా రొయ్యల సాగు ఉండాలని వాల్‌మార్ట్ భావిస్తోంది. అలా అయితేనే తుది వినియోగదార్ల విశ్వాసాన్ని పొందగలమని అభిప్రాయపడుతోంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగు ఒక పెద్ద పరిశ్రమగా మారినందున ఈ పరిశ్రమ స్థిరీకరణకు, దీర్ఘకాలిక వృద్ధికి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించటం అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో వాల్‌మార్ట్ చేపట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదిగా చెబుతున్నారు. దీనికింద రొయ్యల చెరువు, దానిలో ఎటువంటి రకం రొయ్య పిల్లలు వేశారు, వాటిని ఎటువంటి ఆహారం (ఫీడ్) తో పెంచారు… అనే సమాచారం నుంచి వాటి రవాణా ఎప్పుడు, ఎలా మొదలైంది… అమెరికాలోని తుది గమ్యస్థానానికి ఎలా చేరింది… అనే పూర్తి సమాచారాన్ని నమోదు చేసి, తుది వినియోగదారుడికి అందుబాటులో ఉంచుతారు.
రొయ్యల సాగులో నిమగ్నమై ఉన్న రైతాంగాన్ని, ఈ వర్తకంలో భాగస్వాములైన వర్తకులకు మేలు చేసేదిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు, ఇందులో వాల్‌మార్ట్ వంటి అగ్రగామి సంస్థ భాగస్వామి కావటం ఎంతో కీలకమైన అంశమని యూఎస్‌లోని నేషనల్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు జాన్ కానెల్లి వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని సంథ్య ఆక్వా, యూఎస్‌లోని స్టాన్లే పెరల్‌మ్యాన్ ఎంటర్‌ప్రైజెస్ ఇంక్., పాలు పంచుకుంటున్నాయి. మూలం నుంచి ఆహార పదార్ధాల సమాచారాన్ని సేకరించే పద్ధతిని (గ్లోబల్ ఫుడ్ ట్రేసబిలిటీ) ఐబీఎంతో కలిసి 2017 నుంచి వాల్‌మార్ట్ అభివృద్ధి చేస్తోంది. భారతదేశంలోని స్థానిక రైతాంగంతో కలిసి పనిచేసేందుకు, తద్వారా ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు వాల్‌మార్ట్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షుడు పాల్ డిక్ వివరించారు. దీనివల్ల ఇటు రైతులకు, అటు వినియోగదార్లకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.