రంగారావు తనకి దేవుడితో సమానమని, ఆయన్ని చూసే తాను సినిమాల్లోకి వచ్చానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ‘విశ్వనట చక్రవర్తి’ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా అభిమాన నటుడు రంగారావు విగ్రహం ఇక్కడ నెలకొని ఉందనే విషయం నాకు గత ఏడాది నుంచి తెలుసు. ‘సైరా’ సినిమాలో నేను బిజీగా ఉన్నప్పుడు మాజీ మంత్రి మాణిక్యలరావు నన్ను విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. క్షమించండి నేను ఇప్పుడు రాలేను.. తర్వలో వస్తాను అని ఆయన్ని కోరాను. ఆయన వెంటనే సరే అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆ మహానుభావుడి విగ్రహం ఆవిష్కరణ చేసే అదృష్టం నాకు దక్కడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఆయన్ని చూసే నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను. నేను దేవుడిగా భావించే ఆ మహానటుడి విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.’
‘1969లో నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నకి నటన అంటే ఇష్టం కానీ ఆయన ఉద్యోగరీత్యా సినిమాల్లోకి వెళ్లలేకపోయారు. నాటకాల వరకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో మా నాన్నకి ఎస్వీ రంగారావుతో నటించే అవకాశం ‘జగత్ కిలాడీలు’ సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాలో మా నాన్నది చాలా చిన్న పాత్రే అయినా రంగారావుతో నటించే అవకాశం రావడంతో సరే అన్నారు. రావు గోపాలరావు వెండితెరకు పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో రావుగోపాలరావు డైలాగ్ చెప్పడం పూర్తవగానే ఏవిట్రా రావుగోపాలరావు డైలాగులు అలా సాగదీస్తామేమిటి? డైలాగులు అలవోకగా చెప్పేయాలి అని రంగారావు రావుగోపాలరావుతో అన్నారట. నటనలోని ఆయన ప్రత్యేక శైలి వల్లనే రంగారావు మహానటుడు అయ్యారు. ఆయన వల్లనే నటనపట్ల నేను ఆకర్షితుడినై, మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, ఇప్పడు నేను మీ ముందు ‘సైరా’ అని నిలుచున్నాను.’
‘ఎవరైనా నన్ను మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే.. నేను మహానటుడు విశ్వవిఖ్యాత రంగారావు అనే చెబుతాను. అలాగే ఇష్టమైన నటి సావిత్రి అని చెబుతాను. ప్రముఖ నటుడు గుమ్మడి ఒక్కసారి ఇలా అన్నాడు.. ‘రంగారావు తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం. అదే ఆయన హలీవుడ్‌లో పుట్టి ఉంటే అంతర్జాతీయ స్థాయి నటుడు అయ్యేవాడు. కానీ రంగారావు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం.’ అది నిజమే రంగారావు తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ‘నర్తనశాల’లో ఆయన నటనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.’ అని చిరంజీవి తెలిపారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.