Politics

ఆర్టీసీ కార్మికుల ఉసురుగొడుతుంది

Revanth Reddy Curses KCR Over Firing RTC Employees

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అద్వితీయమని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేల మంది ఆర్టీసీ కార్మికులు గతంలో రాష్ట్ర సాధన కోసం తమ వంతు పాత్ర పోషించారన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. తమ ఉద్యోగాలను పణంగా పెట్టి ఆర్టీసీ కార్మికులంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. ‘తెరాస అధినేత హోదాలో ఆనాడు మీరు కూడా పలు వేదికలపై వారి పోరాట పటిమను కొనియాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల జీవితాలు అద్భుతం చేస్తామని హామీలిచ్చారు. గడచిన ఐదున్నరేళ్ల మీ పాలనలో ఆర్టీసీ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండకూడదని, వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యమ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక ఊసరవెల్లిలా రంగులు మార్చారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి దేవుడెరుగు. ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే మనసు కూడా మీకు లేకపోయింది.’ అంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.