కొన్ని ఫ్యాషన్లు తుఫానులా ముంచెత్తుతాయి, ఆ తీవ్రత కొంతకాలం వరకూ నిలిచి ఉంటుంది. మరికొన్ని సుడిగాలిలా ఎంత వేగంగా వస్తాయో అంతే వేగంగా వెళ్లిపోతాయి. ఇంకొన్ని చిరుజల్లులా వచ్చి వెళ్లినట్లు కూడా తెలియదు. అరుదుగా కొన్ని ఫ్యాషన్లు మాత్రమే నీలాకాశంలో తళుకులీనే తారల్లా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. పోల్కాడాట్స్ ఫ్యాషన్ అచ్చంగా అలాంటిదే. యువతరం ఫ్యాషన్లమీద సినిమా ప్రభావం ఎంతటిదో తెలిసిందే. అందులో భాగంగానే పోల్కాడాట్ డ్రెస్సులతో హల్‌చల్ చేసిన ‘ఓ బేబీ’ అమ్మాయిల్ని ఆకర్షించడమే కాదు, చుక్కల దుస్తులమీద మరోసారి మనసు పడేలా చేసింది. ఎంతైనా పోల్కాడాట్స్ ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్. దీనికి కాలంతో సంబంధం లేదు. ఐరోపా, అమెరికా దేశాల్లో అయితే ర్యాంప్‌షోల్లోనే కాదు, మార్కెట్లోనూ చుక్కల ప్యాషన్ నిత్యం సందడి చేస్తూనే ఉంటుంది. సమంతా బేబీ పుణ్యమాని సడెన్‌గా మనదగ్గరా వీటి వాడకం పెరిగింది.
ఆకాశాన్ని కమ్మేసిన నల్లని కారుమబ్బుల వెనక దాక్కున్న ఆ తెల్లని చుక్కల్ని ఫ్యాషన్‌లోకం కొన్నాళ్లపాటు అరువు తెచ్చుకుంది. అవే పోల్కా చుక్కలు. ఆపై వాటిని రంగురంగుల్లో రకరకాల సైజుల్లో గుండ్రంగా చుట్టేస్తూ కొత్తకొత్త డిజైన్లను సృష్టించేస్తూ ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. అసలు ఒకప్పుడు పోల్కాడాట్స్ అంటే నలుపూ తెలుపూనే. తెల్లని ఫ్యాబ్రిక్ మీద నల్లని చుక్కలో లేదా నల్లని బట్టమీద తెల్లని చుక్కలో ఉండేవి. ఆ చుక్కల సైజుల్లోనే తేడాలు ఉండేవి. రానురానూ అన్ని రంగుల్లోనూ చుక్కలు అందంగా కనువిందు చేస్తున్నాయి. పైగా పోల్కా అంటే ఒకప్పుడు ఎక్కువగా పిల్లల గౌన్లే గుర్తొచ్చేవి. కారణమేంటో తెలీదుకానీ ఐరోపా, అమెరికా దేశాలతోబాటు చైనా, జపాన్, కొరియా దేశాల్లో ఆడపిల్లల గౌన్లలో చుక్కల డిజైన్లు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు అన్ని రకాల దుస్తులమీదా చుక్కలు తళుక్కుమంటున్నాయి. అంతేకాదు, ఈ తరానికి తగ్గట్లుగా కాన్వాస్ పరిధిని పెంచుకుని జీన్స్‌లోనూ చుక్కల ఫ్యాషన్ రాజ్యమేలుతోంది. ప్యాంట్లూ టాప్‌లూ స్కర్టులూ… ఇలా జీన్స్ డ్రెస్సులు కూడా చుక్కల్ని లెక్కబెట్టుకుంటున్నాయి. ఇక, బెనారస్, కంచి వంటి పట్టుచీరల్నీ చుక్కల డిజైన్లతో అందంగా నేయడం విశేషం. ప్రముఖ డిజైనర్లు సైతం పోల్కాడాట్స్‌తో ప్రత్యేకంగా చీరల్నీ గౌనుల్నీ డిజైన్ చేస్తున్నారు. అందుకేనేమో తమ వార్డ్‌రోబ్‌లో ఒక్కటైనా పోల్కా డాట్స్ డ్రెస్ కావాలనుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అదీగాక అమ్మాయిల ఫ్యాషన్‌గా మాత్రమే పేరొందిన పోల్కా ఈమధ్య అబ్బాయిల ప్యాంటూషర్టుల్లోనూ కనిపిస్తోంది.
ఐరోపా దేశాల్లోని ఫ్లెమెంకో డ్యాన్సర్లు మొట్టమొదటగా ఈ పోల్కాడాట్ డ్రెస్‌ని ధరించినట్లు చెబుతారు. అయితే డచ్‌కు చెందిన పోల్కా అనే ఓ రకమైన నృత్యం నుంచి ఈ పదం ప్రాచుర్యం పొందిందనీ అంటుంటారు. కానీ మధ్యయుగంలో చుక్కల దుస్తులు ధరిస్తే మశూచికమో క్షయో వచ్చినట్లు భావించేవారట. ఆయా వ్యాధులు వచ్చినవాళ్లకి మచ్చలు ఉన్నట్లే ఈ చుక్కలు కూడా ఉన్నాయని వెక్కిరించేవారట. దాంతో ఆ డిజైన్ వేసుకోవడానికే చాలామంది భయపడేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో వాల్డ్‌డిస్నీ సృష్టించిన మిన్నీమౌస్‌కి పోల్కా డాట్స్ స్కర్ట్ వేయడంతో ఈ ఫ్యాషన్ ఊపందుకుంది. తరవాత హాలీవుడ్ తారలంతా దీనికి ఫిదా కావడంతో ఈ ట్రెండ్‌కి తిరుగులేకుండా పోయింది. మనదగ్గరకొస్తే- ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చీరలతో మొదలై ఆ తరవాత బాబీ సినిమాతో నిలదొక్కుకుని, అప్పటినుంచీ అన్ని రకాల దుస్తుల్లోనూ ఈ చుక్కల డిజైన్ అందంగా మెరుస్తోంది. నిజం చెప్పాలంటే- 1960, 70లలో పోల్కా, ఫ్యాషన్ రంగాన్ని శాసించిందని చెప్పాలి. డ్రెస్సులతోబాటు తలకి పెట్టుకునే బ్యాండ్‌లూ క్యాప్‌లన్నీ కూడా చుక్కలతోనే మెరిసేవి. క్రమంగా బూట్లూ వాచీలూ గాజులూ స్మార్ట్‌ఫోన్లూ… ఇలా ఈతరం వాడే యాక్సెసరీలన్నీ చుక్కల డిజైన్లని సంతరించుకున్నాయి. పోల్కా డాట్స్ ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు అంటారు డిజైనర్లు. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు నగల్లాంటివి పెట్టుకోకపోవడమే మేలు. ఎందుకంటే ఆ చుక్కలే పెద్ద అలంకారం. పోల్కాడాట్స్ ప్యాంటూ షర్టూ లేదా స్కర్టూ టాపూ చీరా బ్లౌజూ వేసుకునేటప్పుడు ఏదో ఒకటి మాత్రమే చుక్కలతో ఉండాలన్నది మర్చిపోకూడదు. పోల్కా టాప్స్ వేసుకున్నప్పుడు చెవులకి కూడా గుండ్రని రింగుల్లాంటివి పెడితే 60ల నాటి రెట్రో ఫ్యాషన్ లుక్ వద్దన్నా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ అయినా పాత ఫ్యాషన్లలో మెరవాలనుకునేవాళ్లు పోల్కాతో ప్రేమలో పడాల్సిందే మరి. ‘సుక్కల్లే తోచావే… ఎన్నెల్లే కాచావే… ఏడబోయావే…’ అన్నట్లు ఉన్నట్టుండి ఒక్కోసారి ఫ్యాషన్ ప్రపంచం నుంచి పోల్కాడాట్స్ మాయమైపోయినట్లు అనిపిస్తుంటుంది. అయితే అవి ఎక్కడికీ పోవు. మబ్బు పట్టిన ఆకాశంలో చుక్కలు కనిపించనట్లే అవి కూడా మధ్యమధ్యలో కనిపించకుండా పోవచ్చుగాక. మబ్బులు వీగిపోగానే నక్షత్రాలు మిలమిల మెరిసినట్లే పోల్కా డాట్స్ కూడా అమ్మాయిల ఒంటిమీద కాంతిమంతంగా మెరుస్తుంటాయి. అందుకే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చుక్కల ఫ్యాషన్ తోడుంటే అమ్మాయి అందాల జాబిల్లే.