Food

దుర్గమ్మ ప్రసాదం ఇలా తయారు చేస్తారు

Vijayawada Kanaka Durga Prasadam Dittam Making

విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దేవీ నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర తీరాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మను దర్శించుకుని ప్రసాదం సేవిస్తేనే కాని తృప్తి చెందరు భక్తులు. అంతేనా! పులిహోర, లడ్డు ప్రసాదం తినకుండా లేదా కొనకుండా వెళ్లరు. అమ్మవారి మీదే కాదు, అమ్మవారి ప్రసాదం మీద కూడా భక్తి ఎక్కువే. ఈ ప్రసాదం స్వీకరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ప్రసాదాలను ‘దిట్టం’ ప్రకారమే అంటే కొలతల ప్రకారంగానే చాలా సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు. ప్రసాదాలకు పెరుగుతున్న ఆదరణతో ప్రసాదం తయారీలో చిన్న చిన్న మార్పులూ వస్తున్నాయి. వాటిల్లో భాగంగానే లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి తయారు చేయడానికి దేవస్థానం వారు రకరకాల కొలతలతో వంటవారికి రకరకాల ‘దిట్టం’ అందచేశారు. ఆ దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేసి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు రుచి చూపించి, వారి సలహాలు తీసుకున్నారు. అందరి దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త ‘దిట్టం’ అనుసరిస్తున్నారు. ఎండోమెంట్స్‌ కమిషనర్‌ కొత్తగా స్థిరపరచిన దిట్టం ప్రకారం 516 లడ్లు తయారు చేయడానికి (ఒక్కో లడ్డు బరువు 80 గ్రా.) ఆరు కేజీల నెయ్యి, పది కేజీల సెనగ పిండి, 20 కేజీల పంచదార, 750 గ్రా. జీడిపప్పు, అర కేజీ కిస్‌మిస్‌ లేదా ఎండు ద్రాక్ష, 75 గ్రా. ఏలకులు, 15 గ్రా. జాజికాయ, 15 గ్రా. పచ్చ కర్పూరం ఉపయోగిస్తున్నారు. పులిహోరకు సంబంధించి స్థిరపరచిన దిట్టం ప్రకారం పది కిలోల బియ్యం, అర కేజీ సెనగ పప్పు, అర కేజీ చింతపండు, 200 గ్రా. ఎండు మిర్చి, 15 కేజీల నూనె, 60 గ్రా. బెల్లం ఉపయోగించి 230 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్టు బరువు 150 గ్రా.) తయారు చేస్తున్నారు. లడ్లు సులువుగా తయారు చేయడానికి కూడా దేవస్థానం చిన్న చిన్న మార్పులు చేసింది. గతంలో ఒక కడాయిలో 730 లడ్డూలు తయారుచేసేవారు. ఇప్పుడు 516 లడ్లు మాత్రమే తయారు చేస్తున్నారు.