Sports

ఎవడ్రా నువ్వు?

Indian Netizens Troll Pakistan Cricketer Over Gautam Gambhir

‘నా వల్లే గౌతమ్‌ గంభీర్‌ కెరీర్‌ ముగిసింది’ అని మీడియాకు చెప్పిన పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌పై ట్విటర్లో విమర్శల వర్షం కురుస్తోంది. ‘ఇంతకీ అసలు నువ్వెవ్వరు?’ అంటూ వ్యంగ్యబాణాలు విసురుతున్నారు. ఇర్ఫాన్‌ పాక్‌ క్రికెట్లో కొన్నాళ్లు సంచలన ప్రదర్శన చేశాడు. 7 అడుగుల 1 అంగుళం పొడవున్న అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా ఉండేది. బంతిని 10 అడుగుల ఎత్తు నుంచి వేయడంతో ఎలాంటి బంతి వేసేవాడో అర్థమయ్యేది కాదు. పాక్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో గంభీర్‌ను అతడు నాలుగు సార్లు ఔట్‌ చేశాడు. ‘గౌతమ్‌ నన్ను చూసి భయపడేవాడు. నా వల్లే అతడి కెరీర్‌ ముగిసిందని అనుకుంటున్నా. ఆ సిరీస్‌ తర్వాత అతడు జట్టులోకి రాలేదు. మ్యాచ్‌లో నన్ను ఎదుర్కొనేందుకు ఇష్టపడేవాడు కాదు. నన్ను చూసేందుకు తటపటాయించేవాడు’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్‌ అన్నాడు. ఇర్ఫాన్‌ మాటలు గంభీర్‌ అభిమానులకు రుచించలేదు. అతడిపై ట్విటర్‌లో ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. ‘మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా నేను గూగుల్‌లో వెతకాలి’, ‘పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇంతకీ ఈ ఇర్ఫాన్‌ ఎవరో తెలియడం లేదు’, ‘మొత్తానికి గంభీర్‌ కెరీర్‌ ముగించానని ఇర్ఫాన్‌ అనుకుంటున్నాడు. అది సరేగానీ ఇంతకీ అతనెవరు?’ ‘గంభీర్‌ వన్డే కెరీర్‌ను నువ్వే ముగించొచ్చు! కానీ నీ కెరీర్‌ను ముగించిందెవరు? నువ్వేకదా. నాలుగుసార్లు ఫిక్సర్లు సంప్రదించినా చెప్పలేదు. నాలుగేళ్లు నిషేధానికి గురయ్యావు. గంభీర్‌ ప్రపంచకప్‌ విజేత. మరి నువ్వు? ఓ కళంకితుడివి’ అని అభిమానులు ఘాటుగా స్పందించారు.