Movies

కవికి కోటి రూపాయిల ఇల్లు

Rajinikanth Buys Home For Writer Worth 1Crore

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానంకు ఇల్లు కొనిచ్చేశారు. సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశానికి కూడా తలైవా హాజరయ్యారు. కలైజ్ఞానం కుటుంబసభ్యులతో కాసేపు సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు రజనీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం గొప్పదని, మాట నిలుపుకొన్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇల్లు విలువ రూ.కోటి అని సమాచారం.

రజనీ సోలో హీరోగా నటించిన తొలి సినిమా ‘భైరవి’ (1978). ఈ సినిమాను కలైజ్ఞానం నిర్మించారు. ‘భైరవి’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పలుమార్లు తలైవా చెప్పారు. కాగా ఈ ఏడాది ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మానసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు భారతీరాజా, రజనీకాంత్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్‌ వేదికపై మాట్లాడుతూ.. కలైజ్ఞానం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని, ఆయన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఇది విన్న రజనీ కల్పించుకుని.. ‘నేను ఇల్లు కొనిస్తాను. ఈ అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వను. త్వరలోనే కలైజ్ఞానంకు సొంత ఇల్లు ఉంటుంది’ అని చెప్పారు.