ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే వెంటనే అరవమని చెప్పి, రైతు కొద్ది దూరంలోఉన్న తన పొలం లో పని చేసుకోడానికి వెళ్ళాడు.
కొంతసేపటికి ఆ పిల్లాడికి ఏమీ తోచలేదు. నాన్నా వాళ్ళని ఆటపట్టించాలని ,”బాబోయ్ తోడేలు, అదిగో తోడేలు,” అంటూ గట్టిగా అరిచాడు. అది వింటూనే ఖంగారుగా రైతు, మిత్రులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకొచ్చి, “ఏది తోడేలు?” అని అడిగారు. పిల్లాడు పక పక నవ్వుతు, “అబ్బె , ఉత్తినే అరిచా!” అన్నాడు. “ఇలా ఉత్తిత్తినే అరవకు. మా పని పాడుచెయ్యకని” మందలించి రైతు వెళ్ళిపోయాడు.
కాస్సేపటికి మళ్ళీ కొంటె గా, “బాబోయ్ తోడేలు” అని పెద్దగా అరవటం, మళ్ళీవాళ్ళంతా కర్రలతో పరిగెట్టుకు రావటం, పిల్ల వాడు మళ్ళీ పెద్దగా నవ్వుతూ “బ్బే !ఉత్తినే అరిచా” అనటం జరిగిపోయింది. “ఇలా ఆకతాయి పనులు చేస్తే నిన్ను ఎవ్వరు నమ్మరు” అంటూకేకలేసి మళ్ళీ తమ పనిలో నిమగ్నమయ్యారు.
కాస్సేపట్లో నిజంగానే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రె పిల్ల మీద కి దూకింది. కుర్రాడు భయంతో గట్టిగా “నాన్నా! బాబోయ్ తోడేలు గొర్రెని చంపేస్తోంది, రండి తొందరగా రండి,” అంటూ పెద్దగా ఆరవ సాగాడు. “ఈ ఆకతాయి పిల్లడు మళ్ళీ అరుస్తున్నాడు,” అని వాణ్ని పట్టించుకోలేదు రైతు. తోడేలు గొర్రె పిల్లని నోటకరుచుకుని అడవిలోకి ఈడ్చుకు పోయింది. పిల్లాడు ఒక పొద పక్కన కూర్చొని భయంతో ఏడుస్తూ కనిపించాడు.
పని ముగించుకుని వచ్చిన రైతు కొడుకు ఏడుస్తూ ఉండటం చూసి, “ఎందుకు ఏడుస్తున్నావని?” అడిగాడు. తండ్రిని చూడగానే “తోడేలు వచ్చిందని గట్టిగా అరచినా మీరెందుకు రాలేదు, తోడేలు గొర్రె పిల్లని చంపి ఎత్తుకు పోయింది. నేను భయంతో ఇక్కడ కూర్చుండిపోయా. ఎందుకు రాలేదు?” అన్నాడు కోపంగా. దానికి రైతు “అబద్దాలాడే వాడి మాట ఎవ్వరు నమ్మరు, పట్టించుకోరు,” అని చెప్పి ఓదార్చి, మిగిలిన గొర్రెలని తోలుకుని ఇద్దరూ ఇంటికి పోయారు.
నీతి: అబద్దాలాడేవాళ్ళని ఎవ్వరూ విశ్వసించరు. వాళ్ళు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.