ఈ ఏడాది వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ వైద్య బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది.
అమెరికాకు చెందిన విలియమ్ కెలిన్, గ్రెగ్ సెమెన్‌జా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫెకు ఈ అవార్డు దక్కింది.
‘కణాలు ఆక్సిజన్‌ను ఎలా గ్రహిస్తాయి, ఎలా పొందుపర్చుకుంటాయి’ అనే అంశంపై వీరు చేసిన పరిశోధనలకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతి వరించింది.
ఈ అవార్డు ద్వారా ఈ ముగ్గురికి కలిపి 9లక్షల 14వేల అమెరికా డాలర్ల నగదు బహుమానం అందించనున్నారు.
కణ సంబంధ జీవక్రియ, శారీరక పనితీరును ఆక్సిజన్ స్థాయిలు ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని వీరు నిరూపించినట్లు నోబెల్ జ్యూరీ తెలిపింది.
వీరు చేసిన ఆవిష్కరణల ఫలితంగా రక్తహీనత, కేన్సర్, ఇతర వ్యాధులపై పోరాటానికి సమర్థవంతమైన సరికొత్త వ్యూహాలకు మార్గం సుగమమైందని జ్యూరీ వెల్లడించింది.