ScienceAndTech

మీ బ్లాక్ & వైట్ చిత్రాలు రంగులోకి మార్చుకోవాలనుకుంటున్నారా?

Convert Black & White Pictures To Color-Telugu Technology News

2018 Google I/O నిర్వహించబడిన సమయంలో గూగుల్ సంస్థ ఒక శక్తివంతమైన సదుపాయం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటివరకు అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే తాజాగా Google photos అప్లికేషన్లో అది ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ సంస్థ స్వయంగా తయారు చేసిన గూగుల్ ఫొటోస్ అప్లికేషన్లో అనేక శక్తివంతమైన ఫిల్టర్స్ లభిస్తుంటాయి. వాటితోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ గా మార్చివేసే Colorize అనే సదుపాయం తీసుకువస్తున్నట్లు గూగుల్ సంస్థ చాన్నాళ్ల క్రితం ప్రకటించింది. దానికి సంబంధించిన డెమోని కూడా  అప్పట్లో ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇన్నాళ్లకి Google Photos Beta వెర్షన్ 4.26 వాడుతున్న వారికి ఈ సదుపాయం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడింది. దీనిని ఉపయోగించి మీ దగ్గర ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో లను ఉన్నఫళంగా కలర్ గా మార్చుకోవచ్చు. చాలా ఏళ్ల క్రితం మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటో లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని స్కాన్ చేసి గూగుల్ ఫొటోస్ లోకి అప్లోడ్ చేయడం ద్వారా, వాటిని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా కలర్‌లోకి  మార్పిడి చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా మీరు కష్టపడాల్సిన పనిలేదు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఆటోమేటిక్గా గూగుల్ గుర్తించి దాన్ని కలర్ గా మార్చడానికి ఆప్షన్ అందిస్తుంది.