Editorials

దిక్కులేక…దరిద్రంగా

Imran Khan Faces Embarrassment From Saudi Prince

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భంగపాట్లు, అవమానాలు తప్పడం లేదు. గత నెల ఐక్యరాజ్యసమితి(ఐరాస) సమావేశాల్లో ఇమ్రాన్‌ ప్రవర్తించిన తీరుతో అసంతృప్తికి లోనైన సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. తాను ఇచ్చిన విమానాన్ని తిరిగిచ్చేయాలంటూ ఇమ్రాన్‌కు తెగేసి చెప్పారు. అందుకే అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో ఇమ్రాన్‌ కమర్షియల్‌ విమానంలో ఇస్లామాబాద్‌ చేరుకున్నారని పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ పత్రిక ‘ఫ్రైడే టైవ్‌ ఓ కథనం ద్వారా వెల్లడించింది. ఐరాస సమావేశాల్లో ఇమ్రాన్‌ ప్రదర్శించిన దౌత్య నీతితో సల్మాన్‌ విసుగు చెందారని, అందువల్లే తన విమానాన్ని తిరిగి తనకు అప్పగించాలని పాక్‌ బృందానికి తెగేసి చెప్పారని సదరు పత్రిక పేర్కొంది. అయితే, ఫ్రైడే టైవ్‌ కథనాన్ని పాక్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఖండించారు. సదరు వార్త నిరాధారమని పేర్కొన్నారు. ఐరాస సమావేశాలకు వెళ్లడానికి ముందు.. ఇమ్రాన్‌ఖాన్‌ సౌదీలో పర్యటించారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్తున్న ఇమ్రాన్‌ కోసం సౌదీ యువరాజు సల్మాన్‌ తన ప్రైవేట్‌ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం ఆ విమానంలో అమెరికా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకొని వస్తుండగా.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి తిరిగి ఇమ్రాన్‌ న్యూయార్క్‌ వెళ్లారు. తర్వాతి రోజు కమర్షియల్‌ విమానంలో ఆయన ఇస్లామాబాద్‌ చేరుకొన్నారు. అయితే తాజా ‘ఫ్రైడే టైవ్‌ కథనం మాత్రం ఈ వాదన తప్పని పేర్కొంది. విమానంలో సాంకేతికలోపం వంటి కారణాలు అన్నీ బూటకమేనని, అమెరికాలో ఇమ్రాన్‌ ప్రవర్తనతో విసుగు చెందిన సల్మాన్‌ తన విమానాన్ని తిరిగి ఇచ్చేయమనడంతో గత్యంతరం లేకనే ఇమ్రాన్‌ కమర్షియల్‌ విమానంలో సొంత దేశానికి తిరిగి వచ్చారని కుండబద్దలు కొట్టింది. టర్కీ, మలేషియాతో కలిసి ఇస్లామిక్‌ దేశాల వాదనను వినిపించాలనుకోవడానికి ఓ ఇంగ్లీషు చానెల్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్టు ఇమ్రాన్‌ చెప్పడం సౌదీ యువరాజుకు నచ్చలేదని, పైగా తన అనుమతి లేకుం డా ఇరాన్‌తో చర్చలు జరపడంపై కూడా సల్మాన్‌ కోపంగా ఉన్నారని సదరు పత్రిక పేర్కొంది.