భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది. వీరిలో 49,128 మంది వేతన జీవుల ఆదాయం రూ. కోటి దాటింది. అదే గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే. ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నవి 1.67లక్షలు ఉన్నట్లు ఐటీశాఖ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19శాతం వృద్ధి కనిపించింది. రూ.కోటి రూపాయలకు పైగా ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో 16,759కు చేరింది. గతేడాది 14,068 మంది రూ.కోటికి పైగా ఆదాయపు పన్ను చెల్లించారు. ఈ అసెస్‌మెంట్ సంవత్సరంలో 2.62 కోట్ల మంది ఎటువంటి ఆదాయం చూపకుండానే రిటర్నులు ఫైల్ చేశారు. 82లక్షల మంది తమ ఆదాయం రూ.5.5 లక్షల నుంచి రూ.9.5లక్షల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.
లక్షకు చేరువలో భారత కోటీశ్వరుల సంఖ్య

Related tags :