* ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు ఆరు శాతానికి పడిపోనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. తొలి త్రైమాసికాల్లో వృద్ధి రేటు భారీగా కుచించుకుపోయిన వేళ ప్రపంచ బ్యాంక్ అంచనాలు కలవరపెడుతున్నాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతంగా ఉన్న రేటులో 0.9శాతం మేర కోతపడనుందని స్పష్టం చేసింది. అయితే 2021లో 6.9శాతానికి, 2022లో 7.2శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఆదాయ వృద్ధి, పన్ను ప్రోత్సహకాల లాంటి పథకాల ఫలితాలతో గ్రామీణ భారత్లో డిమాండ్ పెరుగుతుందని.. తద్వారా వృద్ధి పుంజుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)తో వార్షిక సమావేశం నిర్వహించనున్న కొద్దిరోజుల ముందు ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులు’ పేరిట ఈ నివేదిక వెలువడింది. వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతుల వృద్ధిలో సైతం స్తబ్ధత నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.