* రైల్వేలకు చెందిన ఆన్‌లైన్ టికెటింగ్, టూరిజం, కేటరింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీ ఐపీవో లిస్టింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. కాగా.. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేరు రికార్డు స్థాయిలో 101శాతం పెరిగి రూ. 644 ధరతో లిస్ట్ అవడం విశేషం. నిజానికి ఐఆర్‌సీటీసీ ఐపీవో షేరు ధర ప్రైస్ బ్యాండ్‌ను రూ. 315-320గా నిర్ణయించారు. రూ.320 ఇష్యూ ప్రైస్‌తో ఈ షేరు సోమవారం లిస్టింగ్‌కు వెళ్లగా.. బీఎస్‌ఈలో షేరు ధర ఒక దశలో 101.25శాతం పెరిగి రూ. 644 వద్ద లిస్ట్ అయ్యింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 95.62శాతం పెరిగి రూ. 626 ప్రారంభ ధరతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా రూ. 10,972కోట్లకు ఎగబాకింది. పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఐఆర్‌సీటీసీ ఐపీవో తీసుకొచ్చింది. దీని ద్వారా రూ. 645 కోట్లు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో కంపెనీ ఇది. అంతకుముందు ఆర్‌ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్‌సీవోఎన్‌లు పబ్లిక్ ఆఫర్లకు వచ్చాయి.
* దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2020లో భారత్ మార్కెట్‌లోకి మరో రెండు కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన కియా సెల్టోస్‌కు మంచి ఆదరణ లభించడంతో సన్నాహాలను వేగవంతం చేసింది. సెల్టోస్ తర్వాత ప్రీమియం ఎంపీవీ కార్నివాల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ కారు టయోటా ఇన్నోవా క్రిస్టాకు బలమైన పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారును అనంతపురం ప్లాంట్‌లో తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటోఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించే అవకాశం ఉంది.