DailyDose

రాజ్‌భవన్‌కు చేరిన ఆర్టీసీ పంచాయతీ-తాజావార్తలు-10/14

TSRTC Employees Goes To Rajbhavan-Telugu Latest Breaking News-10/14-రాజ్‌భవన్‌కు చేరిన ఆర్టీసీ పంచాయతీ-తాజావార్తలు-10/14

* అర్థశాస్త్రంలో ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీని వరించింది. ఈసారి ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు. ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌లతో కలిసి అభిజిత్‌ బెనర్జీ ఈ అవార్డును అందుకోనున్నారు. మరో విశేషమేంటంటే అభిజిత్‌, ఎస్తర్‌ భార్యాభర్తలు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

* తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు కోరారు. ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధం కావాలని సూచించారు.

* ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయంపై రూ.వెయ్యి పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీన్ని మూడు విడతల్లో అందజేస్తామని కన్నబాబు వివరించారు. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ పేరిట పథకాన్ని కొనసాగిస్తామన్నారు.

* తెలంగాణ ఆర్టీసీ ఐకాస ఈ నెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. ఖమ్మంలో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణిగంజ్‌లో కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడంపై పవన్ విచారం వ్యక్తం చేశారు.

* గ్రామ సచివాలయ ఉద్యోగాలను వైకాపా కార్యకర్తలకే ఇచ్చారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉద్యోగాలన్నీ వైకాపా కార్యకర్తలకే వచ్చినట్టు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డే చెప్పారన్నారు. సోమవారం చంద్రబాబు నెల్లూరులోని అనిల్‌ గార్డెన్స్‌లో జరిగిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

* తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన సమ్మె ఉద్ధృతమవుతున్న తరుణంలో ఆర్టీసీ ఐకాస నేతలు గవర్నర్‌ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

* బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ నామినేషన్‌ వేశారు.ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు గంగూలీతో పాటు పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. కోశాధికారిగా అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ ధూమల్‌ నామినేషన్‌ వేశారు.

* దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్‌ 2020లో భారత్‌ మార్కెట్‌లోకి మరో రెండు కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన కియా సెల్టోస్‌కు మంచి ఆదరణ లభించడంతో సన్నాహాలను వేగవంతం చేసింది. సెల్టోస్‌ తర్వాత ప్రీమియం ఎంపీవీ కార్నివాల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ కారు టయోటా ఇన్నోవా క్రిస్టాకు బలమైన పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

* తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికుల సమ్మెకు ఓయూ విద్యార్థి సంఘాలు తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు ఓయూ నుంచి బయల్దేరారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

* దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 87.39 పాయింట్లు లాభపడి, 38,214 వద్ద ముగియగా, నిఫ్టీ 29.40 పాయింట్లతో 11,334 వద్ధ స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.15గా ఉంది. ఉదయం స్టాక్‌ మార్కెట్లు కాస్త ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 66 పాయింట్లు ఎగబాకింది.