Kids

గర్వాన్ని అణచండి-చిన్నారుల తెలుగు కథలు

Kill Ego For A Better Life And Peaceful World-Telugu Moral Stories For Kids

ఒక తూనీగ చెట్టుకొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. రెండు మిణుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్చగా తిరుగుతూ తూనీగను చూచి, గర్వంతో “ఓహో నీవా! తూనీగా! దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము. ఆ వేలుగులో వెళతావా?” అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ “మిత్రమా! నేను వెలుగు లేకపోయినా, ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసేముందు మీరు ఏమిటో తెలుసుకోండి!” అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ “నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు. ఎదుటవారిని కించపరచకూడదు. మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మన కన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశం లోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు”. ఎవరి విలువ వారికుంటుంది అన్నది తూనీగ. అప్పుడు మిణుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరాయి.