Politics

కేంద్ర ఆర్థిక మంత్రికి అడ్డం తిరిగిన భర్త

Parakala Speaks About His Wife Nirmala Seetharaman

ఆర్థిక రంగ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌ ఇందుకు భిన్నంగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులపై మండిపడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదన ఒప్పుకోవడానికి విముఖత చూపుతోందంటూ ‘ ది హిందూ’లో ప్రచురించిన ఒక కాలమ్‌లో ఆయన బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార‍్హం. ఒకదాని తరువాత ఒకటి పలు సెక్టార్లు తీవ్రమైన సవాళ్లును ఎదుర్కొంటుండగా, బీజేపీ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్న కారణాలను విశ్లేషించలేకపోతోందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాత్మక దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో పార్టీ థింక్ ట్యాంక్ విఫలమైందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించే ఒక చిన్న మార్గాన్ని కూడా చూపలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మందగమనం పై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖంగా లేదన్నారు. ప్రభుత్వం తిరస్కరణ మోడ్‌లో ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు “నెహ్రూ సోషలిజాన్ని విమర్శించటానికి” బదులుగా, ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గం సుగమం చేసిన రావు-సింగ్ ఆర్థిక నమూనాను బీజేపీ అవలంబించాలని సూచించారు. ఆ ఇద్దరు ప్రధానులూ (పీవీ నరసింహారావు, మన్‌ మోహన్‌ సింగ్‌) పాటించిన విధానాలు ఆర్ధిక సరళీకరణకు దోహదం చేశాయనీ, ఈ విషయాన్ని గుర్తించి ఆ పాలసీలను పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు.