రీమిక్స్ పాటలు చేయడం ఇష్టంలేకే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘గద్దలకొండ గణేష్’ సినిమా నుంచి తప్పుకొన్నారని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ టైటిల్ రోల్‌లో ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయ్యింది. కాగా తొలుత ఈ సినిమా కోసం దేవిశ్రీను తీసుకున్నారు. కానీ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటను రీమిక్స్ చేయాలని చెప్పడంతో ఆయన సున్నితంగా తప్పుకొన్నారట. దీంతో మిక్కీ జే మేయర్ చిత్రానికి బాణీలు అందించారు. ఈ క్రమంలో దేవిశ్రీ ప్రాజెక్టు నుంచి వైదొలగడం గురించి అనేక వదంతులు వచ్చాయి. హరీష్-దేవిల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని కూడా అన్నారు.
ఈ విషయం గురించి హరీష్ స్పందించారు. దేవిశ్రీ రీమిక్స్‌లు చేయరని తెలిసి కూడా ఒప్పించొచ్చనే దీమాతో తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌తో హరీష్ మాట్లాడారు. ‘రీమిక్స్‌లు చేయకూడదని దేవిశ్రీ ఎప్పుడో అనుకున్నారు. ఈ విషయంలో అతడ్ని ఒప్పించొచ్చులే అనుకున్నా. అయితే ఆయన మాత్రం చాలా సున్నితంగా రీమిక్స్ చేయలేనని.. మరోసారి కలిసి పని చేద్దామని ఈ సినిమాను తిరస్కరించారు. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులం. ఆ విషయంలో నాదే పొరపాటు’ అని ఆయన అన్నారు.
హరీష్ ఇంటర్వ్యూ వీడియో చూసిన దేవిశ్రీ ట్విటర్‌లో స్పందించారు. ‘నా గురించి చక్కగా మాట్లాడి, క్లారిటీ ఇచ్చినందుకు హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు. మీ నిజాయతీకి హ్యాట్సా్‌ఫ్. మీపై నాకున్న ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి. మీతో కలిసి పనిచేయాలని నేను కూడా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. దీనికి హరీష్ రిప్లై ఇచ్చారు. ‘మీరు గొప్ప కంపోజర్ మాత్రమే కాదు. గొప్ప వ్యక్తి కూడా. లవ్‌యూ సర్‌జీ’ అని పోస్ట్ చేశారు.