DailyDose

రాజ్యాంగం జోలికి వెళ్తే రక్తపాతమే-తాజావార్తలు-10/15

Siddaramayya Warns Govt On Amending Constitution-Telugu Latest Breaking News-10/15

* గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి వర్సిటీ వేదికగా ఈ పథకానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. దీనిద్వారా 54 లక్షల మందికి సాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

* చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని ఈసందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.

* వైకాపా నేతల దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులోని అనిల్‌ గార్డెన్‌లో వైకాపా బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది. తగినంత బడ్జెట్‌ లేని కారణంగా దీపావళికి ముందే ఇంత భారీ సంఖ్యలో హోంగార్డులను తొలగించడం సంచలనమైంది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆగస్టు 28న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రయాగరాజ్‌లోని యూపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజూ కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా.. తాజాగా తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌లోని 21 విద్యుత్‌ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయా సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

* వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు విచారణ జరుగుతోందని.. ఈ కేసుపై ఊహాగానాలు ప్రచారం చేసే వారికి నోటీసులు పంపుతామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విజయవాడ నగర పోలీస్‌ సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి డీజీపీ ఆయుధ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ.. అక్టోబర్‌ 21న ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామన్నారు.

* వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. భాజపా -శివసేన కూటమి మహారాష్ట్రలో తిరిగి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలలో తిరిగి గెలిస్తే రాబోయే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.

* పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు భారత్‌చేస్తున్న కృషి 2030 నాటికి వేగవంతం కావచ్చు. భారత రైల్వేలు 2030 నాటికి నికరంగా కర్బన ఉద్గారరహితంగా మారుతుందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ దశకు రావడానికి చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. నాటికల్లా రైల్వేలు పూర్తిగా విద్యుత్తు ఆధారంగానే పనిచేస్తాయని పేర్కొన్నారు. కాలుష్యం తగ్గించాలనే ప్రధాని మోదీ ఆశయంలో రైల్వేలు ప్రధాన భాగమని చెప్పారు.

* రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. మైసూరులో జరిగిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులు, అణగారిన వర్గాల కోసం అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని తెలిపారు. అసమానతల వల్ల అవకాశాలు కోల్పోయిన వారికి ఆయన అండగా నిలబడ్డారన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 292 పాయింట్లు పెరిగి 38,506 వద్ద, నిఫ్టీ 87 పెరిగి 11,428 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా బ్లూచిప్‌ షేర్లను బాగా కొనుగోలు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, మారుతీ షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 లాభపడ్డాయి. వేదాంత షేర్లు 4శాతం మేరకు ఎగశాయి. నిఫ్టీ ఐటీ సూచీ తప్ప మిగిలినవి మొత్తం లాభాల్లో ముగిశాయి.