ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ కొనుగోలు చేయటం చాలా సందర్భాలలో చూస్తున్నాం. ఈ క్రమంలో మరోసారి యూజర్లకు యాపిల్ కొత్త గ్యాడ్జెట్‌ను పరిచయం చేయబోతోంది. ఆగ్యుమెంటెడ్ రియాల్టీ (ఏఆర్) సాంకేతికతతో యాపిల్ గ్లాసెస్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే వీటిని యాపిల్ సొంతంగా కాకుండా ఇతర కంపెనీలతో కలసి రూపొందించనుందట. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీలకు చెందిన ఏఆర్ గ్లాసులు బరువుగా, పెద్దవిగా ఉన్నాయి. దీంతో వాటికి అంతగా ఆదరణ లభించలేదు. వీటిని గమనించిన యాపిల్ తేలికపాటి, చూడటానికి సాధారణ కంటి అద్దాల్లా ఉండేలా ఏఆర్ గ్లాసెస్‌ను తీసుకొస్తోందట. దీనికి ‘ప్రాజెక్ట్ స్టార్ట్ బోర్డ్’ అని పేరు పెట్టారట. దీనికి సంబంధించి డిజైన్స్ అంటూ కొన్నిఫొటోలు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి.
యాపిల్ గ్లాసెస్‌లో సొంత గ్రాఫిక్ ప్రాసెసర్/సీపీయూ ఉండవు. అలా అని నాణ్యత విషయంలో వెనుకంజ వేయడం లేదు. ఇతర ఏఆర్ గ్లాసెస్ కంటే డిస్‌ప్లే, కెమెరా, వైర్‌లెస్ కనెక్టివిటి ఉత్తమంగా ఉండేలా చూసుకుంటోంది. ఇవి తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటాయని సమాచారం. మార్కెట్‌లో పోటీని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే అందించేలా యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ గ్లాసెస్ అంతర్జాతీయంగా విడుదల కానున్నట్లు కొన్ని టెక్ వెబ్‌సైట్లు రాస్తున్నాయి. మరికొన్ని అయితే మార్చి తర్వాతే అని చెబుతున్నాయి. ఇప్పటికే ఏఆర్ గ్లాసెస్‌కు సంబంధించిన డిజైనింగ్ పూర్తయిందట. ఈ ఏడాది ఆఖరికి తయారీ ప్రారంభిస్తారని సమాచారం.
ఏఆర్ గ్లాసెస్ కోసం గతేడాది కొలరాడోకు చెందిన అకోనియా హోలో గ్రాఫిక్స్ అనే స్టార్టప్ కంపెనీని యాపిల్ కొనుగోలు చేసింది. సన్నని, పారదర్శకత కలిగిన స్మార్ట్ గ్లాస్ లెన్స్‌ను అకోనియా తయారు చేస్తుంది. డిజైన్ విషయంలో యాపిల్ గతంలోనే ఒక ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. క్యూపర్టినో అనే కంపెనీ రూపొందించిన డిజైన్‌ను తన స్థాయి తగ్గట్టుగా లేదని యాపిల్ తిరస్కరించింది. ఏఆర్ గ్లాసెస్‌ను నేరుగా మొబైల్‌కు కనెక్ట్ చేసేలా సాంకేతికను రూపొందిస్తోందట. వీటి ధర గురించి అప్పుడే చర్చించుకోవడం కష్టమే అంటూనే అంతర్జాతీ టెక్ సంస్థలు వీటి ధర 3500 డాలర్ల కంటే తక్కువ ఉండొచ్చు అని చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ గ్లాసెస్ కంటే తక్కువకే ఏఆర్ గ్లాసెస్ తీసుకొస్తామని చాలా రోజుల నుంచి యాపిల్ చెబుతుతోంది. మరి ఆచరణలో పెడుతుందేమో చూడాలి. అన్నట్లు మైక్రోసాఫ్ట్ గ్లాసెస్ ధర 3500 డాలర్లే.