Editorials

టర్కీ….నీకు చుక్కలు చూపిస్తా!

Trump Super Angry On Turkey

సిరియాలో కుర్దుల ఆధీనంలో ఉన్న ఈశాన్య ప్రాంతాలపై సైనిక దాడికి పాల్పడుతున్న టర్కీపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. అందులో భాగంగా స్టీల్‌పై సుంకాలు పెంచనున్నట్లు, 100బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలకు స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. టర్కీ సైనిక చర్య సిరియాలోని సామాన్య పౌరులను బలిగొంటోందన్నారు. ప్రాంతీయంగా సుస్థిరత, శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఈ చర్యలు యుద్ధ నేరాలు, మావనత్వ సంక్షోభానికి దారితీస్తున్నాయని టర్కీ అధికారులకు ఇది వరకే స్పష్టం చేశామన్నారు. అయినా ‘‘ఇదే ప్రమాదకరమైన, విధ్వంసక మార్గాన్ని కొనసాగిస్తే టర్కీ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత వేగంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు.

సిరియాలో సైనిక దాడులకు కారణమవుతున్న టర్కీ నేతలపైనా కఠిన నిసేదాజ్ఞలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో వారి ఆస్తుల్ని స్తంభింపజేయడం, అమెరికాలోకి రాకుండా అడ్డుకోవడం లాంటి కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. స్టీల్‌పై సుంకాలను తిరిగి 50శాతానికి పెంచుతామన్నారు. అక్కడక్కడ ఉన్న ఐసిస్‌ ఆనవాళ్లను తుడిచిపెట్టడానికి ఇంకా కొన్ని అమెరికా సైనిక బృందాలు సిరియాలో ఉన్నట్లు తెలిపారు.

సిరియాలో జరుగుతున్న దాడులపై భారత్‌ సైతం ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యల వల్ల ప్రాంతీయంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లి ఉగ్రవాద నిరోధక చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపింది. సిరియా సార్వభౌమత్వాన్ని గౌరవించి సంయమనం పాటించాలని టర్కీకి సూచించింది. చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని హితవు పలికింది. ఇస్లామిక్‌ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దు గెరిల్లాల ఆధ్వర్యంలోని సిరియా డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డీఎఫ్‌)కు అమెరికా ఇన్నాళ్లూ బాసటగా నిలిచింది. కానీ, ఐఎస్‌తో తమ పోరాటం ముగిసిందని.. ఆ ప్రాంతం నుంచి తమ దళాలు వైదొలుగుతున్నాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.