DailyDose

కేసీఆర్‌కు అనుమతి నిరాకరణ-తాజావార్తలు-10/17

KCR Chopper Refused Flying Permission-Telugu Breaking News-10/17

* ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియమాకాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టుల భర్తీలో ఇంటర్య్వూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 2020 జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ఏపీపీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి ఉంది. అయితే గత రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఏవియేషన్‌ శాఖ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ సభను రద్దు చేసినట్లు తెరాస ప్రకటించింది.

* ఛానల్‌ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల పోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్‌ కింద సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చంచల్గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్‌తో మియాపూర్‌ కోర్టుకు తీసుకెళ్లారు.

* ఆర్టీసీ సమ్మె విషయంలో మేథావులు మౌనంగా ఉండటం మంచిదికాదని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తే విలీనం ఎలా సాధ్యమవుతుందో వివరిస్తామన్నారు. చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.

* తూర్పుగోదావరి జిల్లా తునిలో పాత్రికేయుడు కాతా సత్యనారాయణ హత్యకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి తుని మండలం ఎస్‌.అన్నవరం గ్రామ పరిధిలో సత్యనారాయణ హత్యకు గురయ్యారు.

* అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారన్న కారణంతో 311 మందితో కూడిన విమానాన్ని మెక్సికో వెనక్కి పంపింది. అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి కొన్ని నెలలుగా కొందరు భారతీయులు మెక్సికోలో తలదాచుకుంటున్నారు. ఇందుకు గానూ ఒక్కో వ్యక్తి రూ.25-30 లక్షల వరకు ఏజెంట్లకు చెల్లించినట్లు సీనియర్‌ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు.

* వరికి రూ.1835, పత్తికి రూ.5,500ల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందన్నారు. సిద్ధిపేట జిల్లా 168 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

* దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు నవంబర్‌ 4 నుంచి 15 వరకు వాహనాలకు సరి – బేసి విధానం అమలు చేస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ విధానం అమలులో ఉన్న కాలంలో రోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ విధానం అమలులో ఉంటుందని స్పష్టంచేశారు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే రూ.4వేలు జరిమానా విధించనున్నట్టు హెచ్చరించారు.

* కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా గురుద్వారా సాహిబ్‌ దర్శనానికి వెళ్లే భారత యాత్రికుల నుంచి పాకిస్థాన్‌ రుసుము వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఒక్కో యాత్రికుడి నుంచి 20 డాలర్ల (రూ.1,400) చొప్పున రుసుము వసూలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్థాన్‌ యోచిస్తోంది.

* దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాల బాటల పయనించాయి. బ్రిటన్‌, ఈయూల మధ్య బ్రెగ్జిట్‌పై కొత్త ఒప్పందానికి అంగీకరించినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిస్థితులు మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి, 39వేల మార్కును దాటి, 39,052వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 11,586వద్ద స్థిరపడింది.