చంద్రయాన్2కు చెందిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా తీవ్రంగా అన్వేషిస్తున్నది.
ఇప్పుడిప్పుడే చంద్రుడి దక్షిణ ద్రువం మళ్లీ వెలుగులోకి వస్తున్నది. అయితే ఆ ప్రాంతంలోనే కూలిన విక్రమ్ ఆచూకీ కోసం నాసా వెతుకుతున్నది.
నాసాకు చెందిన లూనార్ రికనయిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) దానికి సంబంధించిన తాజా చిత్రాలను తీసింది.
ఆ ఫోటోలను పరిశీలిస్తున్నామని వాషింగ్టన్‌లోని ఎల్ఆర్‌వో ప్రాజెక్టు శాస్త్రవేత్త నోహా పెట్రో తెలిపారు.
సోమవారం రోజున చంద్రుడి ఉపరితలంపై వెలుతురు పెరిగిందని, గడిచిన నెలతో పోలిస్తే దక్షిణ ద్రువ ప్రాంతంలో నీడ తగ్గిందన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీన దక్షిణ ద్రువం నుంచి ఎల్ఆర్‌వో వెళ్లినా.. అక్కడ చీకటి ఛాయలు ఉన్న కారణంగా విక్రమ్ ఆచూకీని పసికట్టలేకపోయారు.
అయితే మళ్లీ ఈ సోమవారం ఆ ప్రాంతం మీదుగా ఎల్‌ఆర్వో వెళ్లిందని, ఆ ఇమేజ్‌లను ఇంకా పరిశీలిస్తున్నామని,
మరికొన్ని రోజుల్లో మరింత స్పష్టమైన సమాచారం వస్తుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.
చాలా జాగ్రత్తగా గాలిస్తున్నామని, విక్రమ్‌కు ఏం జరిగిందో త్వరలోనే వెల్లడిస్తామని పెట్రో తెలిపారు.