Fashion

గుంటగలగరాకు ముద్ద చేసి జుట్టుకు రాస్తే….

Telugu Fashion & Ayurvedic Hair Style Tips - Ayurvedic Leaf Paste For Hair

ముఖాన్ని మెరిపించేందుకు కొన్ని పూతలు వేసుకుంటాం. మరి శిరోజాల సంగతి… వాటికీ సహజసిద్ధంగా వేసే పూతలు కొన్ని ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణ అందించి… ఆరోగ్యాన్నిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే… మన శరీర తత్వాన్ని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ఆహార విహారాల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. అప్పుడే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

వాత ప్రకృతి…
ఈ తత్వం ఉండేవారి శిరోజాలు ఎండిపోయినట్లు, పల్చగా, సన్నగా ఉంటాయి, చివరలు చిట్లుతూ, గరుగ్గా ఉండి, దువ్వితే నిలబడవు, చుండ్రు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇలాంటివారు…గుంటగలగరాకు పూత… గుంటగలగరాకు, యష్టిమధు, మెంతులు, కచ్చూరాల చూర్ణాన్ని ఇనుప బాణలిలో రెండు లేదా మూడు గంటలు నానబెట్టాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి జుట్టు మొత్తం పాయలుగా విడదీస్తూ తలంతా పట్టించుకోవాలి. గంట తరువాత తలపై నీటిని కొంచెం కొంచెంగా పోస్తూ శుభ్రపరుచుకోవాలి. తలలో ఏమాత్రం మూలికల చూర్ణం మిగలకుండా ఎక్కువ నీటితో స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ పూత వేసుకుంటే వెంట్రుకలు చిట్లిపోకుండా మెత్తగా, పట్టులా ఉంటాయి.

పిత్త ప్రకృతి…
ఈ తత్వం ఉండేవారి జుట్టు పల్చగా, దువ్వితే అలాగే నిలబడి ఉంటుంది. వెంట్రుకలు సన్నగా, జిడ్డుగా ఉంటాయి. లేత గోధుమ వర్ణంలో ఉండి, త్వరగా నెరిసిపోతుంది. బట్టతల వచ్చే అవకాశం ఎక్కువ. వేపాకు పూత: గుంటగలగర, మందార, వేప పచ్చి ఆకులను ముద్దలా చేసుకోవాలి. దీనికి యష్టిమధు, బలా చూర్ణాలను కలిపి పేస్టులా చేసి తలంతా పట్టించుకోవాలి. గంట తరువాత కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే మంచిది.

కఫ ప్రకృతి…
వీరి జుట్టు ఒత్తుగా ఉంటుంది. వెంట్రుకలు జిడ్డుగా, మందంగా ఉంగరాలు తిరిగి ఉంటాయి. ముదురు గోధుమ రంగులో లేదా నలుపు వర్ణంలో మెరుస్తున్నట్లు అనిపిస్తాయి.

మెంతిఆకులతో: గుంటగలగరాకు, పునర్నవ, చంగల్వకోష్టు, బావంచాలు, వేప, గానుగ, మెంతిఆకులు లేదా మెంతుల చూర్ణం, లేదంటే మెంతులు నానబెట్టి రుబ్బిన ముద్ధ.. వీటిలో లభ్యమైనవాటిని వారానికి ఒకసారి కలిపి పూతలా వేసుకోవాలి. పచ్చిమూలికలు దొరికితే నూరి ముద్ద చేసి తలంతా పట్టించి గంట తరువాత స్నానం చేయాలి. ఎండు మూలికల చూర్ణం దొరికితే దానికి సరిపడా వేడినీటిలో వేసి కలిపి ఇనుప కడాయిలో రెండు గంటలు నానబెట్టి తరువాత తలకు పట్టించుకోవాలి. ఇది గోరింటాకు ముద్దలా కలిపి తలకు పూత వేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేస్తే చాలు.