రేపు విజయ నగరం అమ్మవారి పండుగ. లక్షల్లో జనం వచ్చి ఆ చిన్న పట్టణాన్ని రద్దీతో ముంచెత్తుతారు. ఎన్నో దశాబ్దాలుగా పెరిగిన పెద్ద చింత చెట్టుని కోసి పొడవుగా చెక్కి సిరిమాను చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం బైరాగి నాయుడు వంశస్తున్ని , ఆ మాను కి చివర కుర్చీ కట్టి అందులో కూర్చోబెట్టి రాజుల కోట దగ్గరికి తెచ్చి వెనక్కి తీసుకెళ్తారు. ఇలా3 సార్లు చేస్తారు. మాను చివర కట్టి కూర్చోబెట్టిన వ్యక్తిని అమ్మవారి ప్రతినిధిగా భావిస్తారు.
పండుగ లో సిరిమాను ఊరేగటం ప్రధానం. సిరిమాను కి ముందు అంజలి రథం, పాలధార, తెల్ల ఏనుగు, బెస్తల వల ఊరేగుతాయి.
గతంలో ఎప్పుడో గజపతి రాజుల ఇంటి ఆడపడుచు బొబ్బిలి యుద్ధం సమయంలో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె పేరు పైడి తల్లి. ఆమె మృతదేహం బెస్తలకి దొరుకుతుంది.
ఇందుకు బెస్త వారి వలని ఊరేగిస్తారు. రాజుల ఇంటి ఆడపిల్ల, గ్రామ దేవతగా చెబుతారు.
మొత్తానికి ఆ స్త్రీ కి ఆకోట లో బ్రతకలేని స్థితి కలిగించేరన్న మాట.
సాధారణంగా ఇలాటి దూరాగతాలకి సాక్ష్యం శ్రామిక వర్గాలే అవుతారు. కాబట్టి వారిని మంచి చేసుకోడానికి , పెద్దోళ్ల రహస్యాలు కాపాడే షరతు తో వారి జీవనోపాధి వల కు గౌరవం కలిపించి ప్రధాన పండుగ లో స్థానం కలిగిస్తారు. రాజావారి ఇంటి ఆడ పడుచుఆత్మహత్య చేసుకుందంటే పరువు సమస్య కాబట్టి ఇతరులు ఎవరూ నోరెత్తకుండా ఆమె ని అమ్మవారిని చేసి పెట్టేరు.
ఇందులో ఏనుగు గజపతుల బల చిహ్నం. పాలధార దేశ సమృద్ధికి చిహ్నం గా పెట్టేరు.
ఇక అసలు విషయం …సిరిమాను….. గుడి, పూజారి వర్గం , పురోహిత, బ్రాహ్మణ వర్గాలు ప్రజల మన్నన అందుకుంటాయి. అదికూడా రాజుగార్ల ( స్టేట్) కనుసన్నల్లోనే అని సత్యం ఇక్కడ ఋజువవుతోంది.
ఇక్కడే కాదు, దాదాపు అన్ని గ్రామదేవతలూ ఎదో ఒక హింస నుండీ తప్పించుకునే క్రమంలో ప్రాణాలు బలి చేసుకున్న వాళ్లే. ఆయా ప్రాంత కులీన వర్గాల ప్రయోజనాల కోసం వారి మరణాల్ని glorify చేసి, ఎక్కువ చేసి, వారిని దేవతలుగా మార్చి ఊరి ప్రజల బ్రతుకులపై రుద్దుతారు.
కాదన్న వాళ్ళని రాక్షసులుగా చేసి చంపించేసి, దేవతే చంపిందంటారు. (ఇక్కడ మేడారం వీర వనితల సాహసం వేరు. వాళ్లిద్దరూ కాకతీయ రాజుల్ని గడగడ లాడించిన భిల్ల వనితా మణులు.)
ఇక సిరిమాను .
ఏ దేవతా దేవుడూపచ్చని చెట్టుని కొట్టేయ్యమని అడగరు. కానీ ఒక్క అర్ధ గంట ఊరేగింపు కోసం కనీసం 40 లేక50 ఏళ్ల వయసున్న చెట్టును ప్రతీ ఏటా నరకడం ఎంత ప్రజా వ్యతిరేకమో ఎవ్వరూ ఆలోచించరు.
ఆ అర గంట తరవాత ఆ మోడు ఎందుకూ పనిచెయ్యదు. అలా ప్రతీ ఏటా ఒక్కో పెద్ద చెట్టు. ఆ చెట్టు ఎవరిదైతే వాళ్లని దేవత కాపడుతుందనే భావం తోనో ఏమో గానీ ,ఎదిరిస్తే చావు మూడుతుందన్న భయంతో మాత్రం చెట్టు స్వాంతదారు ఎవరూ నోరెత్తరు.
చెట్టుకొట్టిన సమయంలో పక్షుల గోల, గుండెని కరిగిస్తుంది. పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లిన నేటి పరిస్థితుల్లో కూడా ఈ ఆచారం కొనసాగడం ప్రజా వ్యతిరేకం కాదా.
అలాగే దొరల గడీల్లో నిరుపేద పోరాట మహిళల చేత నగ్నంగా ఆడించిన బతుకమ్మ ని బహిష్కరించాల్సింది పోయి కొనసాగించడం సరే… రాష్ట్ర పండుగ చెయ్యడం ప్రజా పోరాటాల్ని అవమానించడం కాదా… తిరిగి బతుకమ్మలాడే స్త్రీలకు చీరెలు పంచడం చేస్తే, ఆనాడు భంగపడిన వారి ఆత్మ గౌరవాలు తిరిగి వారికి వస్తాయా….
వర్షాలు పడి ప్రకృతంతా పువ్వులు పూచే కాలం, తుమ్మెదలు మొదలైన కీటకాలు కడుపునిండా ఆహరం తినే కాలం. తేనెటీగలు తమ ఆహారంగా మకరందం (nectar) ను సేకరించి తేనె కూడబెట్టుకునే కాలంలో….
అన్ని రకాల పువ్వుల్ని ఒకేసారి అదీ 8 రోజుల పాటు కనీసం మొగ్గ లేకుండా కోసి పారేస్తే, ఎన్ని వేల కీటకాలు, సీతాకోక చిలుకలూ ఆకలికీ మాడి చనిపోతాయో ఆలో చించేమా….మళ్లీ కొమ్మలు కొత్త చిగుర్లు వేసి పువ్వులు రాబోయేటప్పటికి కనీసం 1 నెల పట్టొచ్చు కదా. మరి ఈలోగా ……
ఇక మరింత ఎక్కువగా పర్యావరణాన్ని దెబ్బతీసే పండగ…. పూరీ రథయాత్ర. 3 రధాల్ని చెయ్యడానికి పెద్ద పెద్ద చెట్లని విపరీతంగా కొట్టేస్తారు. రధాల తయారీకి ముందు ఆయా పడగొట్టిన చెట్ల దేహ భాగాల్ని చూస్తే గుండె గుబేలుమంటుంది.
గుడి ముందరి వీధి వీధి అంతా కత్తిరించిన చెట్ల తో నిండి పోతుంది. ఇక్కడ మరింత పెద్ద పెద్ద చెట్లు , మరింత పెద్ద సంఖ్యలో కొట్టేయ్యబడతాయి. ప్రతీ ఏటా ఈ విధ్వంశం నిరాటంకంగా సాగుతోనే ఉంది.
గుడిసె కోసం కాస్తంత కొమ్మ కొట్టే ఆదివాసీ ని నేరస్తుడిని చేసిన రాజ్యం ఈ మతాధికారుల్నీ, ఆచారాలను సమర్ధించే ప్రజా ప్రతినిధుల జోలికి కనీసం వెళ్ల గలవా అనేది ఆలోచించాలి.
సామ్రాజ్య వాదులు, దేశీయ పెట్టుబడిదారులు చేస్తున్న పర్యావరణ విధ్వంశం సరే సరి. మరి మనం కూడానా…
ఆలోచిద్దామా…
ఇంకా ఈ జాబితాలోకి ఇంకెన్ని పండుగలు వస్తాయో కదా తరచి చూస్తే….