DailyDose

విశాఖలో 3000కిలోల గంజాయి పట్టివేత-తాజావార్తలు-10/18

3000Kilos Marijuna Seized In Vizag-Telugu Latest Top Breaking News Today-10/18

* అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో సీబీఐ వాడిన భాషతీరుపై జగన్‌ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్‌కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలన్నారు.

* తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోందని.. ఆ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫిలిప్పీన్స్‌లోనూ సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కార్మికులకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది.

* శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల కొత్తూరు మండలం మాతలలో సామాజిక భవనానికి వైకాపాకు చెందిన రంగులు వేస్తుండటంతో వెంకటరమణతో పాటు పలువురు నిరసనకు దిగారు. ఆ సమయంలో తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బూరాడ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* తెలంగాణ ఆర్టీసీలో ప్రతి ఒక్కరూ నాయకులేనని కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజారవాణా వ్యవస్థను బతికించాలని తాము కోరుతున్నామని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘సకల జనుల సమరభేరి’ కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ బస్సులు తిరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఉన్న తెలంగాణలో బస్సుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోందని ఆయన ప్రశ్నించారు.

* ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో సీబీఐ శుక్రవారం దిల్లీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ నిధులు సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఛార్జిషీట్‌లో ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ దాదాపు ఎనిమిది వారాల పాటు ఆయన్ను తిహార్‌ జైలులో ఉంచి విచారించిన విషయం తెలిసిందే.

* యూపీఏ పాలనపై నిందలు వేయడం మానుకోవాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు. మన్మోహన్‌ సూచనని తాను గౌరవిస్తానని.. అయితే ఎప్పుడు.. ఎక్కడ.. ఏం తప్పు జరిగిందో సందర్భానుసారంగా బహిర్గతం చేయడం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు. మన్మోహన్‌ ప్రధానిగా.. రాజన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ప్రభుత్వం రంగ బ్యాంకులు అధ్వాన దశకు చేరాయని ఆమె మరోసారి ఆరోపించారు.

* సిరియా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు టర్కీ మరోసారి షాక్‌ ఇచ్చింది. సిరియాలో సైనిక దాడులు ఆపాలంటూ ట్రంప్‌ రాసిన లేఖను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ చెత్త బుట్టలో వేసినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. సిరియాలో దాడులు చేస్తూ వేలాది మంది అమాయకుల మరణానికి కారణమవ్వొద్దంటూ ట్రంప్‌ లేఖలో సూచించారు. సిరియాలో కుర్దులపై దాడులు ఆపకపోతే చరిత్రలో ఓ కఠినాత్ముడిలా మిగిలిపోతారు.. మూర్ఖుడిలా ప్రవర్తించొద్దంటూ ఎర్డొగాన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ తన లేఖలో పేర్కొన్నారు.

* క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌తో కలిసి.. మళ్లీ ఓపెనింగ్‌ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు నాటి టీమిండియా ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. అయితే రిటైర్‌ అయిన వీరిద్దరూ మళ్లీ ఓపెనింగ్‌ ఎలా చేస్తారనేదే కదా మీ సందేహం. ఇలాంటి మాజీలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది రోడ్డు భద్రత అవగాహన ప్రపంచ సిరీస్‌. ఈ సిరీస్‌ ఆవిష్కరణ సందర్భంగా సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ఈ టోర్నీ నిర్వహించడం మంచి ముందడుగు అని మెచ్చుకున్నాడు. సచిన్‌తో కలిసి మళ్లీ ఓపెనింగ్‌ చేయడానికి, బ్రెట్‌లీని ఎదుర్కోడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

* దేశీయ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్లు లాభపడి, 39,298 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,661వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.14గా ఉంది. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 32పాయింట్లతో ట్రేడింగ్‌ను కొనసాగించింది. విదేశీ మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు వేగంగా కదలాడాయి.

* విశాఖ జిల్లా పాడేరు మండలం కరపుట్టు గ్రామ సమీపంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3 వేల కిలోలకుపైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు సమాచారంతో విశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో జీమాడుగుల మండలం నుంచి పాడేరు వైపునకు వెళ్తున్న ట్రావెల్‌ బస్సును ఆపి తనిఖీ చేయగా ఇంత పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది.