Editorials

పాకిస్థన్…ఒళ్లు దగ్గరపెట్టుకోకపోతే నిషేధిత జాబితాలోకే!

FATF Warns Pakistan-Telugu Latest Editorials

ఉగ్రవాదుల చర్యల విషయంలో కపట నీతిని ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) మరోసారి షాకిచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక మూలాలను నిరోధించే విషయమై పాక్‌పై ఇప్పటికే కఠిన చర్యలకు పూనుకుంది. ప్రస్తుతం పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ఏటీఎఫ్‌ చేసిన 27 అంశాలపై చేసిన కార్యచరణ ప్రణాళికలో పాక్‌ 22 అంశాల లక్ష్యాలను చేరుకోలేదు. పాక్‌ తన వైఖరిని మార్చుకోకపోతే ‘బ్లాక్ లిస్ట్‌’లోకి వెళ్లక తప్పదని శుక్రవారం ఎఫ్‌ఏటీఎఫ్‌ తేల్చి చెప్పింది. పాక్‌ తన తీరు మార్చుకునేందుకు మరో నాలుగు నెలల అవకాశం కల్పించింది. ఇచ్చిన సమయంలోపు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే కచ్చితంగా ‘బ్లాక్ లిస్ట్‌’లో పెట్టేస్తామని స్పష్టం చేసింది. ‘పాక్‌ తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ చెబుతోంది. ఆ దేశ నిర్లక్ష్యపు వైఖరిని ఖండిస్తోంది. 2020 ఫిబ్రవరి నాటికి నిర్దేశించిన 27 లక్ష్యాలను చేరుకోకపోతే ఇక ఎలాంటి అవకాశాలు ఇచ్చేది లేదు. వచ్చే ఏడాది సమీక్ష జరిగే నాటికి పాక్‌ తన వైఖరి పూర్తిగా మార్చుకుని కనపడాలి’ అని ఎఫ్‌ఏటీఎఫ్‌ స్పష్టం చేసింది. నిషేధిత ఉగ్రవాదులు, సంస్థల విషయంలో చేసిన సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. ఈ విషయంలో ఎన్నో సార్లు పాక్‌ను హెచ్చరించినా పాక్‌ పట్టించుకోవడం లేదు. గతేడాది అక్టోబరులో తొలిసారిగా సమీక్ష జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి సమీక్ష నిర్వహించారు. అయినా..పాక్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఎఫ్‌ఏటీఎఫ్‌కు చెందిన ఆసియా-పసిఫిక్ గ్రూప్‌ బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని సిఫార్సు చేసింది. దీనిపై తాజాగా జరిగిన ప్లీనరీ సమావేశాల్లో చర్చ జరిగింది. శుక్రవారంతో ఆ సమావేశాలు ముగియడంతో పాక్‌పై ఈ నిర్ణయం తీసుకుంది.