అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వారానికి ఒకసారి కోర్టుకు హాజరుకావడం కష్టసాధ్యంగా మారిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అందుకే మినహాయింపు కోరుతున్నా..
గతంలో జగన్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ వేశారని.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. అంతేగాక, రెండు రోజుల సమయం కూడా వృథా అవుతోందని కోర్టుకు వివరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారమవుతోందని చెప్పారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆరేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేదు..
అసౌకర్యంగా ఉందని హాజరు నుంచి మినహాయింపు కోరడం లేదని, సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందని న్యాయవాది వివరించారు. ప్రజల ప్రయోజనాల కోసమే మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు గత ఆరేళ్లలో ఏ ఒక్క ఆరోపణైనా ఉందా? అని అన్నారు.
ఎన్నడూ కోరలేదు.. అడగలేదు..
అంతేగాక, కౌంటర్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ వాడిన భాష తీరుపై జగన్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్‌కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించిందని ఆరోపించారు. జగన్ స్వయంగా హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో తెలపాలని అడిగారు. గత ఆరేళ్లలో ఎన్నడూ కేసుల వాయిదా కోరలేదని, స్టే కూడా అడగలేదని వివరించారు జగన్ తరపు న్యాయవాది.
సీబీఐ వాదన ఇలా..
అనంతరం సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించాయని, ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిరాకరించినట్లు వివరించారు. అందుకే ఇప్పుడు కూడా ఆయనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.