DailyDose

ఒక్క నెలలో 84లక్షల మంది కస్టమర్లు-వాణిజ్యం-10/18

Jio Added 84Lakh Customers In One Month-Telugu Latest Business News-10/18

* టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ సంచలనం. మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే కోట్ల మంది కస్టమర్లను తనవైపునకు తిప్పుకొంది. తాజాగా జియో మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో 84 లక్షలకుపైగా కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లోకి చేరినట్లు భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) వెల్లడించింది. ఒకే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో ఒక నెట్‌వర్క్‌లోకి కస్టమర్లు చేరడం ఇంతవరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ల వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు ట్రాయ్‌ పేర్కొంది. దాదాపు 84 లక్షలకుపైగా చందాదారులను చేర్చుకున్న జియో ఒకే నెలలో 2.49 శాతం వృద్ధి నమోదు చేసింది. ట్రాయ్‌ ఆగస్టు నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 34.80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి 5 లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో 32.70 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ట్రాయ్‌ నివేదికలో పేర్కొంది.ఎయిర్‌టెల్‌తో పోలిస్తే వొడాఫోన్‌ ఐడియా పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకుంది. దాదాపు 49 లక్షలకుపైగా నెట్‌వర్క్‌ను వీడగా.. ప్రస్తుతం 37.50 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

* దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు పెరిగి 39,298కి చేరుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11,660 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: యస్ బ్యాంక్ (8.65%), మారుతి సుజుకీ (2.80%), పవర్ గ్రిండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.33%), ఎన్టీపీసీ (2.32%), ఎల్ అండ్ టీ (1.81%). టాప్ లూజర్స్: టాటా మోటార్స్ (-1.19%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.78%), బజాజ్ ఆటో (-0.65%), భారతి ఎయిర్ టెల్ (-0.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.21%).

* భారత మార్కెట్లోకి సరికొత్త కారును బెంజ్‌ విడుదల చేసింది. బెంజ్‌ జీ 350డీ పేరుతో ఎస్‌యూవీ ప్రియులకు పరిచయం చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.5కోట్లుగా నిర్ణయించింది. భారత్‌లోకి తొలిసారి ఏఎంజీ కాని జీక్లాస్‌ను తీసుకురావడం విశేషం. జీ వేగన్‌గా పిలిచే ఈ మోడల్‌ను తొలుత సైనికుల కోసం నిర్మించారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 40 ఏళ్ల నుంచి జీక్లాస్‌ శ్రేణికార్లను బెంజ్‌ ఉత్పత్తి చేస్తోంది. రేంజి రోవర్‌ స్పోర్ట్‌, పోర్ష్‌ కెనాన్‌, ల్యాండ్‌రోవర్‌ డిఫెండర్లకు గట్టి పోటీ ఇస్తుంది.

* మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల వేతనాన్ని ఆర్జించారు. సాధారణ వేతనం మిలియన్‌ డాలర్లు పెరగడంతో పాటు ఈయన వంతు కేటాయించే షేర్లు కూడా పెరిగాయి. ‘నాదెళ్ల వ్యూహాత్మక నాయకత్వంతో పాటు వినియోగదారులను ఆకట్టుకోవడంతో కంపెనీ స్థితిగతులే మారిపోయాయి. ఆయన రాకతో సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది’ అంటూ మైక్రోసాఫ్ట్‌ డైరెక్టర్లు ప్రశంసించారు. 2014లో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు 84.3మిలియన్‌ డాలర్ల వేతనం అందుకున్నారు. ఇప్పటి వరకు అదే ఆయన అందుకున్న అత్యధిక వేతనం. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9లక్షల షేర్లు ఉన్నాయి. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు సగటున 1,72,512 డాలర్ల వేతనం అందుకున్నారు.

* ఆర్థిక మందగమనం నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రాథమిక అంశాలను పరిష్కరించేందుకు భారత్‌ కృషి చేసిందని.. కానీ ఇంకా అనేక సవాళ్లు అపరిష్కృతంగానే ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. బ్యాంకుల విలీనంతో కొన్ని సమస్యల్ని తీర్చే అవకాశం ఉందని ఐఎంఎప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు. ఈ తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే దీర్ఘకాలిక అంశాలపై దృష్టి సారించడం కీలకమన్నారు. మానవ వనరులపై పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యమైన అంశమన్నారు. మహిళలను శ్రామిక రంగంలోకి తీసుకురావాలని సూచించారు. భారత్‌లో ప్రతిభ గల మహిళలున్నారని.. కానీ చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ గణనీయ వృద్ధి సాధించిందని.. భవిష్యత్తులోనూ మంచి వృద్ధి నమోదు చేస్తుందని ఐఎంఎఫ్‌ భావిస్తున్నట్లు తెలిపారు. అయితే నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సి ఉందని.. వాటిని భారత్‌ కొనసాగిస్తుందని క్రిస్టిలినా ఆశాభావం వ్యక్తం చేశారు.

* క్యాబ్‌ సర్వీసుల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చిన ఓలా సంస్థ తాజాగా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలను ప్రవేశపెట్టింది. ‘ఓలా డ్రైవ్‌’ పేరుతో గురువారం బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు. ఓలా డ్రైవ్‌ను విస్తరించేందుకు భవిష్యత్తులో కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడి పెట్టనుంది. 2020 కల్లా 20 వేల సెల్ప్‌ డ్రైవ్‌ కార్లను సమకూర్చుకొనే లక్ష్యంగా ఓలా పని చేస్తుందని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలోనే ఓలా డ్రైవ్‌ సేవలు హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ నగరాల్లో కూడా ప్రారంభిస్తామని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.