Movies

అమెరికాలో ప్రణతి ఉద్యోగం…

Manchu Pranathi Reddy Working In The US-Could Be Reason For Divorce

మంచు మ‌నోజ్ విడాకుల ప్ర‌క‌ట‌న ఆయ‌న అభిమానుల‌కు షాక్ ఇవ్వొచ్చు గాక‌. కానీ మీడియాలో ఎప్ప‌టి నుంచో న‌లుగుతున్న వ్య‌వ‌హార‌మే ఇది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు, స‌ర్దుబాట్లూ, కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌డం – ఇవ‌న్నీ గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రుగుతూనే ఉన్నాయి. చివ‌రికి… ట్విట్ట‌ర్ లో విడాకుల బాంబు పేల్చాడు మ‌నోజ్‌. ప్ర‌ణ‌తిరెడ్డితో 2015లో మ‌నోజ్ పెళ్ల‌య్యింది. ఇది ప్రేమ వివాహం. కామ‌న్ ఫ్రెండ్స్ ద్వారా ప్ర‌ణ‌తి – మ‌నోజ్‌ల పరిచ‌యం జ‌రిగింది. ప్ర‌ణ‌తీనే మ‌నోజ్ ద‌గ్గ‌ర‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చింది. అయితే అప్ప‌ట్లో మోహ‌న్‌బాబు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు పెళ్లికి నో చెప్పారు. కానీ మ‌నోజ్ అంద‌రినీ కూర్చోబెట్టి, స‌ర్దిచెప్పి, పెళ్లికి ఒప్పించాడు. 2016 వ‌ర‌కూ వీళ్ల కాపురం స‌జావుగానే సాగింది. అయితే ఆ త‌ర‌వాత‌… ప్ర‌ణ‌తి అమెరికా వెళ్లిపోయింది. అక్క‌డే ఓ ఉద్యోగం చేస్తూ.. గ‌డుపుతోంది. అది మ‌నోజ్‌కి న‌చ్చ‌లేదు. అప్ప‌ట్లో మ‌నోజ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండేవాడు. ఇద్ద‌రికీ కలిసి టైమ్ గ‌డిపే స‌మ‌యం ఉండేది కాద‌ని ప్ర‌ణ‌తి ప్ర‌ధాన ఫిర్యాదు. అమెరికాలో ప్ర‌ణ‌తి ఉద్యోగం చేయ‌డం మ‌నోజ్ కి ఇష్టం లేదు. అలా దూరం పెరిగింది. మ‌ధ్య‌వ‌ర్తులు ఎంత ప్ర‌య‌త్నించినా… ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ బంధం అత‌క‌లేదు. కాక‌పోతే… ఇది వ‌ర‌క‌టి ఫ్రెండ్ షిప్ మాత్రం ఇద్ద‌రి మ‌ధ్యా కొన‌సాగుతూనే ఉంది. ఇద్ద‌రూ ఓ అభిప్రాయానికి వ‌చ్చి.. విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మ‌నోజ్ చేసిన ట్వీట్ కూడా.. ప్ర‌ణ‌తికి చ‌దివి, వినిపించి, ఆమె ఓకే అన్న త‌ర‌వాతే… మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టాడ‌ట‌. క‌లిసి కొట్టుకోవ‌డం కంటే, విడిపోయి ఎవ‌రికి వాళ్లు హాయిగా బ‌త‌క‌డం మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాక‌- ఇద్ద‌రూ కోర్టు మెట్లెక్కారు. ఈ గొడ‌వ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూనే మ‌నోజ్ త‌న కెరీర్‌పై దృష్టి పెట్ట‌లేక‌పోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు చేస్తాన‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు మ‌నోజ్‌. అందుకు త‌గ్గ‌ట్టు ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. మ‌నోజ్ ఇప్ప‌టికే కొన్ని క‌థ‌ల్ని సిద్ధం చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఫ్రెష్షుగా సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించ‌బోతున్నాడు.

నటుడు మంచు మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియచేశారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగిసింది. మా ఇద్దరి మధ్య చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి పూర్తి గౌరవం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నేను గతకొంతకాలంగా సినిమాలపై దృష్టి సారించలేకపోయాను.  నా కుటుంబంతోపాటు స్నేహితులు, అభిమానులు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు.  నాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. మళ్లీ నేను సినిమాల్లో నటించనున్నాను’ అని మనోజ్‌ తెలిపారు.