Devotional

వేలిముద్రలతో మానసిక శుద్ధి

Mudras Can Heal Body Mind And Soul-Telugu Latest Devotional News

భారతీయ సంస్కృతికి యోగ శాస్త్రం మూలస్తంభం వంటిది. వాటిలో ఒక భాగం ముద్రలు. మన చేతులకు ఉండే ఐదు వేళ్లు 5 రకాల మూల పదార్థాలను సూచిస్తాయి. అవి.. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. మానవ శరీరం కూడా ఈ పంచ భూతాలతోనే తయారైంది. అందుకే శబ్ధ, స్పర్శ, రూప, రస, గ్రంథములనే 5 తత్వాలు మన శరీరంలో ఉన్నాయి.

మన చేతిలోని ఒక్కొక్క వేలు ఒక్కొక్క మూలకాలన్ని ఇలా సూచిస్తుంది.

భూతత్త్వం – ఉంగరపు వేలు
జలతత్త్వం – చిటికన వేలు
అగ్నితత్త్వం – బొటన వేలు
వాయుతత్త్వం – చూపుడు వేలు
ఆకాశ తత్త్వం – మధ్య వేలు

ముద్ర అంటే మన చేతి వేళ్ళతో చేసే ఒక భంగిమ. మన ఐదు వేళ్లలో ఏ రెండు వేళ్లను ఉపయోగించి చేసే ప్రతి భంగిమకూ ఒక ప్రత్యేక ఉపయోగం ఉంటుంది. ధ్యాన స్థితిలో ప్రశాంతంగా కూర్చోవడానికి, ఇంద్రియనిగ్రహాన్ని ఏకాగ్రతను సాధించడానికి, ముద్రలు ఎంతో ఉపయోగపడతాయి. ఆత్మని పరమాత్మతో చేర్చే ప్రయత్నంలో మౌనంతో ఉన్న ఓ వ్యక్తికి ముద్రలనేవి సాధనాలుగా ఉంటాయి.

నిరంతరం ముద్రల ద్వారా సాధన చేస్తూ ఋషులు, మునులు, యోగులు తమ తపఃశక్తిని పెంచుకునేవారు. ముద్రలు మానసిక శక్తిని, వైఖరిని, గ్రహణ శక్తిని ,ఏకాగ్రతను పెంపొందిస్తాయి. ముద్రలకు నాడి మండలానికి సంబంధం ఉంది. వివిధ భంగిమలలో ముద్రల కదలిక ద్వారా మనస్సు స్వాధీన పడుతుంది. మన భావనలు, మన ఆలోచనలు సరైన రీతిలో నడుస్తాయి. ఓ శక్తి ప్రవాహం మనలో వ్యాపించిందనే భావానికి లోనవుతాము. మన ఊహలు, ఆలోచనలు, పరిస్థితులను బట్టి బాహ్య పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి.

మనస్సును, శరీరంలోని తత్వాలను, శక్తి ప్రసారాన్ని నియమించడం కోసమే ముద్రలను ఉపయోగిస్తారు. ఈ ముద్రలు యజ్ఞాదికార్యాలలోనూ, వైదిక కర్మలలోను హఠయోగాది ప్రక్రియలలోను, ఆలయాల్లో దేవతారాధనకీ, దేవతా శిల్పాల నిర్మాణంలోను, నాట్యంలోను ఉపయోగిస్తారు.

కొన్ని మినహా చాలా ముద్రలు సాధారణ వ్యక్తులు అందరూ చేయవచ్చు. ముద్రల సాధనను గురువు వద్ద శిక్షణ పొందవలెను. ఈ ముద్రలు బంధాలు అన్నీ ప్రతి రోజు చేయనక్కరలేదు. ఎవరికీ ఏది అవసరమో వారు దానిని మాత్రమే అభ్యసించుట మంచిది. శరీరంలో వివిధ అంగాలను పటిష్టం చేయడానికి ఆసనాలు నిర్దేశించబడ్డాయి. అవి వ్యాయామానికి భిన్నమైనవి. వ్యాయామం వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయే కాని నరాల మీద ప్రభావం ఉండదు.

ఆసనాలు తమ ప్రభావాన్ని శరీరంలోని అంతర్భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ముద్రలు మస్తిష్కమును శాంతింపజేసి, సరైన ఆజ్ఞలను అందుకొని నాడుల ద్వారా సకల అంగాలనూ నిర్దేశిస్తాయి. వ్యాయామం కాస్త కఠినం అనిపిస్తే, ఆసనాలు సున్నితమైనవి. ఆసనాల కంటే ముద్రలు లోతైనవి. ఇవి శరీరాంగాలకు అతీత శక్తులకు సంబంధించినవి. వాటి ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసి లోపాలను సవరించవచ్చును.

ముద్రల సాధన వల్ల కొన్ని శారీరక శుద్ధి విధానాలు, మానసిక శుద్ధి విధానాలు, ఆధ్యాత్మిక లాభాలు ఉంటాయి..