ScienceAndTech

మేడం అని మెసేజ్ వస్తే డిలీట్ చేయండి

Online Scammers Targetting Women With SMS Frauds

‘‘మేడం… పండుగల సందర్భంగా గూగుల్‌ పే ఆఫర్లు ప్రకటించింది… మీరు రూపాయి బదిలీ చేస్తే రెండు రూపాయలు మీ వ్యాలెట్‌లోకి వస్తాయి.. రూ.10 వేలకు రూ. 20 వేలు…’’ అంటూ రెండు రోజుల క్రితం మమత అనే గృహిణికి ఫోన్‌ వచ్చింది. ఆమె ఆశపడి… సూచిత ఖాతాకు గూగుల్‌ పే ద్వారా పది రూపాయలు పంపింది. వెంటనే ఆమె వ్యాలెట్‌లో రూ.20 జమయ్యాయి. ఆమెకు గురి కుదిరింది… ఏకంగా రూ.1.10 లక్షలు జమ చేసింది… క్షణాల్లో ఆమె సొమ్ము ఆవిరైపోయింది. నిందితుడికి ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అయ్యింది.

దిల్లీ, నోయిడా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు చేస్తున్న కొత్త దోపిడీ ఇది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఇలా రోజుకు రూ.25-35 లక్షల వరకూ కొల్లగొడుతున్నట్లు పోలీసుల అంచనా. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, వైజాగ్‌, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, కర్నూలు ప్రాంతాల్లోని పలువురి నుంచి నేరగాళ్లు రూ.కోట్లలో కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే రోజూ సగటున రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బాధితులు పోగొట్టుకుంటున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో సిమ్‌లు వాడే వారే నేరగాళ్లకు లక్ష్యం. రెట్టింపు సొమ్ము అంటూ… నమ్మకం కోసం మొదట రూ.10 వేల వరకూ నగదు బదిలీ చేస్తారు. తర్వాత బాధితులు ఎక్కువ మొత్తం జమ చేయగానే నిందితులు ఫోన్లు కట్టేస్తారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు.

ఓఎల్‌ఎక్స్‌లో పాత వస్తువుల విక్రయ ప్రకటనలపైనా నేరస్థులు కన్నేశారు. ఆయా వస్తువులు కొంటామంటూ ప్రకటనకర్తలకు ఫోన్‌ చేస్తారు. తమకు గూగుల్‌ పే యాప్‌ లేదని, భారత్‌ పే ఉందని చెబుతారు. నగదు బదిలీ చేశాకే వస్తువులు పంపించాలని నమ్మిస్తారు. ‘మీ చరవాణికి పంపే లింకును క్లిక్‌ చేయ’మంటారు. అలా బాధితులు క్లిక్‌ చేయగానే… గూగుల్‌ పే సంకేత పదం (యూపీఐ) నమోదు చేయాలని వస్తుంది. దాన్ని నమోదు చేసిన క్షణాల్లోనే బాధితుడి ఖాతా నుంచి నగదు మాయమైపోతుంది.