చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి మీదుగా ప్రయాణిస్తుంటే… మొక్కజొన్న పొలంలో గణగణమంటూ పళ్లాల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ పళ్లెం మోగించే వారెవరూ కనిపించరు. ఎందుకంటే.. ఓ పరికరం పళ్లాన్ని మోగిస్తుంటుంది. కోతులు, పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే యువకుడే… ఈ చిన్నపాటి పరికరాన్ని రూపొందించాడు. ఇంటర్లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఒకేషనల్ కోర్సు చేసిన అతను… చిన్నచిన్న వస్తువులతో దీన్ని తయారు చేశాడు.తండ్రితో పాటు రైతన్నల కష్టాన్ని చూసి…ప్రభాకర్ తండ్రి సెల్వం…. దేవదొడ్డిలో రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అందులో ఆయన మొక్కజొన్న పండిస్తున్నారు. కష్టాలకోర్చి పండించిన పంట చేతికొచ్చే సమయానికి… పక్షులు, కోతులు, అటవీ మృగాలు దాడి చేస్తుండటం వల్ల నష్టపోతున్నారు. సెల్వంతో పాటు ఆ ప్రాంత రైతులందరి పరిస్థితీ అదే. ఈ పరిస్థితుల్లో పక్షులు, జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే…రాత్రింబవళ్లూ పొలాల్లో కాపలా ఉండక తప్పేదికాదు. పంట కోసం తన తండ్రితో పాటు ఊరి వాళ్లు పడుతున్న కష్టాన్ని చూసిన ప్రభాకర్… ఏదైనా పరిష్కారం దొరుకుతుందని యూట్యూబ్‌లో వెదికాడు. అక్కడ లభించిన సమాచారంతో ఆటోమేటిక్ ఫ్యాన్ తయారు చేశాడు. శబ్దాలు చేసే పరికరాన్ని ఫ్యాన్‌కు అనుసంధానించాడు. తొలుత తయారు చేసిన పరికరం… గాలి ఉన్నప్పుడే తిరిగేది. అందువల్ల గాలి లేనప్పుడు కోతుల బెడద తప్పేది కాదు. అప్పుడు మళ్లీ బుర్రకు పదును పెట్టిన ప్రభాకర్ … సోలార్ ప్లేట్లు, మోటార్‌తో ఆటోమేటిక్ పరికరాన్ని తీర్చిదిద్దాడు. పళ్లాలు వాటంతటవే మోగేలా చేశాడు. దీని వల్ల పొలంలోకి వచ్చే జంతువులు, పక్షుల సంఖ్య తగ్గిపోయి రైతుల కష్టాలు తీరాయి. అన్నదాతల మోములపై చిరునవ్వులు విరిశాయి.
కోతుల బెడదను నివారించే యంత్రం రూపొందించిన చిత్తూరు యువకుడు
Related tags :