Sports

చిట్టి పొట్టి క్రికెట్‌లోకి యువరాజ్‌సింగ్ ఆగమనం

Yuvraj Singh Returns To T10 Cricket Format

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ త్వరలో జరగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొనే అవకాశముందని ఆ టోర్నమెంట్‌ ఛైర్మన్‌ షా ఉల్‌ ముల్క్‌ చెప్పాడు. అబుదాబి వేదికగా నవంబర్‌ 15 నుంచి 24 వరకు జరిగే మూడో సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్‌ నుంచి ఒక్కర్ని కూడా ఎంపిక చేయలేదు. ఈ విషయంపై స్పందించిన ముల్క్‌.. బీసీసీఐ నియమాలను గౌరవించే భారత్‌ నుంచి రిటైర్‌ అయిన ఆటగాళ్లని తీసుకుంటున్నామని చెప్పాడు. ‘యువీతో తుది చర్చలు జరుగుతున్నాయి. టోర్నీలో అతడిని ఆడిస్తామనే విశ్వాసం మాకుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం’ అని పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్‌ యువీ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెనడాలో జరిగిన గ్లోబల్‌ టీ20 లీగ్‌లోనూ పాల్గొన్నాడు. ఒకవేళ యువీ అబుదాబి టీ10 లీగ్‌ ఆడేందుకు అంగీకరిస్తే.. అభిమానులకు శుభవార్తే. కాగా ఈ టోర్నీలో శ్రీలంక ఆటగాళ్లు లసిత్‌ మలింగా, థిసారా పెరీరా, నిరోషన్‌ డిక్‌వెల్లా, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ, పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదీ ఆడనున్నారని తెలుస్తోంది.