దేశంలో పాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుద్ధిచేసిన పాలలోనూ (ప్రాసెస్డ్ మిల్క్) నాణ్యత ప్రమాణాలు కొరవడినట్లు భారత ఆహార భద్రత ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షించిన మొత్తం పాల శాంపిళ్లలో 37.7 శాతం ప్రాసెస్డ్ మిల్క్ శాంపిళ్లు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్లు సర్వేలో తేలింది. ఇందులో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల బ్రాండ్లు సైతం ఉండడం గమనార్హం. భద్రతా ప్రమాణాల విషయంలోనూ 10.4 శాతం ప్రాసెస్డ్ మిల్క్ శాంపిళ్లు విఫలమైనట్లు వెల్లడైంది. మరోవైపు 12 శాతం నమూనాలలో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. ఈ కల్లీ శాంపిళ్లు తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళలో ఎక్కువగా నమోదయ్యాయి. 2018 మే నుంచి అక్టోబర్ మధ్య దేశవ్యాప్తంగా 1,103 నగరాలు, పట్టణాల నుంచి మొత్తం 6,432 పాల నమూనాలను (శాంపిళ్లను) సేకరించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో 40.5 శాతం శుద్ధిచేసిన పాల శాంపిళ్లు కాగా, మిగిలినవి శుద్ధిచేయని ముడి పాలకు సంబంధించినవి. వ్యవస్థీకృత డెయిరీ రంగం నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిందేనని, 2020 జనవరి 1నాటికి అన్ని డెయిరీ యూనిట్లలోనూ పరీక్ష, తనిఖీ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టంచేసింది.
పాల నాణ్యతపై అధ్యయన వివరాలను శుక్రవారం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో పవన్ అగర్వాల్ వెల్లడించారు. శుద్ధిచేసిన పాలలో అఫ్లటాక్సిన్-ఎం1, యాంటీబయాటిక్స్, పురుగుమందుల అవశేషాలను గుర్తించినట్లు చెప్పారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించి, మొత్తం శుద్ధి చేసిన శాంపిళ్లలో (2,607) 10.4 శాతం శాంపిళ్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేదని వివరించారు. ముడి పాలలో కంటే ప్రాసెస్ చేసిన పాలలో అఫ్లటాక్సిన్-ఎం1 సమస్య అధికంగా ఉన్నది. తమిళనాడు, ఢిల్లీ, కేరళ నుంచి సేకరించిన శాంపిళ్లలో ఈ అవశేషం ఎక్కువగా ఉన్నది అని అగర్వాల్ తెలిపారు. ఆహారం, పశుగ్రాసం ద్వారా అఫ్లటాక్సిన్.. పాలలో చేరుతుందని, అఫ్లటాక్సిన్ అవశేషాలకు సంబంధించి దేశంలో సమగ్ర సర్వే చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అఫ్లటాక్సిన్‌ను గుర్తించడానికి దేశంలో సరైన ల్యాబ్ అందుబాటులో లేదు. అఫ్లటాక్సిన్‌ను గుర్తించే పరికరాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అగర్వాల్ తెలిపారు. నాణ్యతకు సంబంధించి, మొత్తం 37.7% పాల నమూనాలు నిర్దేశిత ప్రమాణాలను పాటించలేదని, వాటిల్లో కొవ్వులు, ఎస్‌ఎన్‌ఎఫ్(సాలిడ్స్-నాట్-ఫ్యాట్), షుగర్, మాల్టోడెక్‌స్ట్రిన్ వంటి కలుషితాలు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించామన్నారు. అదే ముడి పాల విషయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. మొత్తం 3,825 నమూనాలలో 47% నమూనాలు నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు తగ్గట్లు లేవని అగర్వాల్ తెలిపారు.
వ్యవస్థీకృత డెయిరీ సెక్టార్‌కు ఈ అధ్యయనం ఒక మేల్కొలుపు వంటిదని చెప్పారు. కొవ్వులు, ఎస్‌ఎన్‌ఎఫ్.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. వ్యవస్థీకృత రంగం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. వచ్చే 6-8 నెలల్లో ప్రమాణాలకు కట్టుబడి ఉంటారని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా.. వారు మాతో విభేదించవచ్చు. మా అధ్యయనాన్ని సవాల్ చేయొచ్చు. అయినప్పటికీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను వారు పాటించాల్సి ఉంటుంది అని ఆయన బదులిచ్చారు. అవ్యవస్థీకృత రంగంలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ముడి పాలు నాణ్యంగా ఉండేలా చూసేందుకు, నాణ్యమైన పశుగ్రాసాన్ని పశువులకు అందించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నది.పాలల్లో కల్తీ ఎక్కువని సామాన్యులు భావిస్తారు. అయితే కల్తీ కంటే కలుషితమే అత్యంత ప్రమాదకర సమస్య అని మా అధ్యయనంలో తేలింది. ప్రధాన బ్రాండ్లకు చెందిన ప్రాసెస్డ్ మిల్క్‌లోనూ మలినాలు ఉన్నట్టు గుర్తించాం.