Agriculture

మల్బరీ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

Telugu Latest Agricultural News Today Oct 2019 - Govt Supports Mulberry Farming-మల్బరీ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

మల్బరీ పంటను సాగు చేసే రైతులకు ఉపాధిహామీ నుంచి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది. పట్టు పురుగుల నిర్వహణ కోసం పెంపకగది నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. మల్బరీ తోట పెంపకానికి మూడేండ్లలో రూ. 1,39,006 అందజేయడంతో పాటు, పట్టు పురుగుల పెంపకపు గది నిర్మాణం కోసం రూ. 1,03,044 అందజేస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మరింత ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ముందుకు సాగాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

పట్టు పురుగుల ద్వారా రైతులు లాభాలు గడించేలా ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించడంతో పంటపై మరింత ఆసక్తి చూపించనున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ ద్వారా రైతులకు పట్టు పరిశ్రమ పంటకు అవసరమైన షెడ్డు నిర్మాణంతో పాటు, ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీ మొక్కల పెంపక కేంద్రం మరింత పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం ఇందులో ఎకరం తెల్లమద్ది, పది ఎకరాల్లో మల్బరీ పంటను వేయడంతో పాటు, ఎకరం 20 గుంటల్లో నర్సరీని నిర్వహిస్తున్నారు. 40 వేల మల్బరీ, 10 వేల తెల్లమద్ది మొక్కలను పెంచుతున్నారు. ఇక్కడి నర్సరీలో పెంచుతున్న మొక్కలను రైతుల అవసరాల మేరకు రాయితీపై పంపిణీ చేస్తారు. తక్కువ కాలంలో పూరైయ్యే ఈ పంటపై రైతులు మరింత ఆసక్తి చూపించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

దీనికోసం ఇక్కడి క్షేత్రంలో ఇద్దరు ఫీల్డ్ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను కలిసి మల్బరీ తోటతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఇక్కడ నర్సరీ నిర్వహణకు మరో నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది 40 వేల మొక్కలను, గత ఏడాది 2 లక్షలకు పైగా రైతులకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఒక్కసారి మొక్కలను తీసుకొని నాటిన అనంతరం రైతు తిరిగి మొక్కలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. పదేండ్ల కాలం వరకు దీని ద్వారానే పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది.

మల్బరితోట తక్కువ కాలం పంట. కేవలం నాలుగు నెలల్లో ఈ పంట పూర్తి అవుతుంది. నర్సరీ నుంచి మొక్కలు తీసుకున్న అనంతరం రైతు చేనులో నాటితే నాలుగు నెలల్లో మూడు నుంచి ఐదు అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీనికి కావాల్సిన మందులు, అవి వాడే విధానాన్ని అధికారులు రైతులకు వివరిస్తారు. మొక్కలు కావాల్సిన రైతులు ముందుగా పట్టు పరిశ్రమశాఖ పేరిట డీడీ తీయాల్సింటుంది. ఎకరానికి 5500 మొక్కలను పంపిణీ చేస్తారు. ఒక్కో మొక్కకు రూ. 2 చొప్పున రైతులు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మల్బరీతో రైతులకు జంతువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొదటి పంట నాలుగు నెలల కాలంలో పూర్తయితే దాని కాండం చివరికి కత్తిరించాల్సి ఉంటుంది. మిగిలిన కాడలను తిరిగి రెండో పంటగా ఉపయోగిస్తారు. దానికి కేవలం రెండు నెలల కాలం మాత్రమే పడుతుంది. అనంతరం అవే కాడలను రెండో పంటగా తిరిగి నాటుతారు. అవే కాడలతో మూడో పంట కాలం మూడు నెలలు ఉంటుంది. అంటే ఒక్కసారి మొక్కలను కొనుగోలు చేస్తే అవి మూడు పంటలకు ఉపయోగపడుతాయి. 10 నెలల కాలంలోనే మూడు పంటలను తీయవచ్చు.

3 నుంచి 5 అడుగులు పెరిగిన చెట్ల నుంచి పట్టు కాయలను తీసి అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. దీనిని విక్రయించేందుకు ఇక్కడి రైతులు హైదరాబాద్‌కు తీసుకెళ్తారు. కిలో పట్టుకాయలకు రూ. 300 నుంచి రూ. 400 వరకు ధర పలుకుతుండగా, దీనికి ప్రభుత్వం రూ. 50 బోనస్ కలిపి రైతులకు అందజేస్తున్నది. రైతులు మల్బరీని సాగు చేసిన అనంతరం బెంగళూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి గుడ్లను కొనుగోలు చేసితొమ్మిది రోజులు ట్రేలో నిల్వ ఉంచుతారు. తొమ్మిది రోజుల అనంతరం వాటికి మల్బరీ ఆకులను చిన్నగా తరిగి మేతగా వేస్తారు. అనంతరం వీటికి 10 రోజుల పాటు మూడు దళాలుగా ఆకుల ద్వారా ఆహారాన్ని అందించి గుడ్ల నుంచి పురుగులు బయటకు వచ్చేలా 10 రోజుల్లో ఆహారాన్ని అందించిన అనంతరం వాటిని రైతు ఏర్పాటు చేసుకున్న షెడ్డులో వేసే అప్పుడు ఆకులతో పాటు, కాడలను వేతగా వేస్తారు. ఇలా 20 రోజుల వ్యవధిలో పట్టు పురుగులు పెరిగి, అనంతరం రైతు విక్రయించుకునే అస్కారం ఉంది. రైతులు వాటికి విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు, జనగామా ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని, ఆసక్తిగల రైతులు మొక్కలు తీసుకెళ్లవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో మల్బరీ పంటను విస్తరించేలా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.