తనకు తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక గురు కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు కొన్ని రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తనిఖీల్లో రూ.409 కోట్ల లెక్కలేని సంపద బయట పడిందని ఐటీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో కల్కి భగవాన్, అతని కుమారుడు కృష్ణకు చెందిన 40 ఆశ్రమాల్లో అధికారులు సోదాలు నిర్వహించగా ఈ మొత్తం బయటపడింది. తమ ఆశ్రమాలకు వస్తున్న డొనేషన్లను కొందరు సిబ్బంది పక్కదారి పట్టించి, నల్లధనంగా మార్చుతున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. బయటపడిన సంపదలో భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. ‘‘2.5 మిలియన్ డాలర్ల (రూ.18 కోట్లు) అమెరికన్ కరెన్సీని సీజ్ చేశాం. రూ.26 కోట్ల విలువైన 88 కిలోల బంగారు ఆభరణాలు, రూ.5 కోట్ల విలువగల 1,271 క్యారెట్ల బరువైన వజ్రాలను కూడా సీజ్ చేశాం. కల్కి గ్రూపునకు చెందిన లెక్క తేలని సొమ్ము మొత్తం కలిపి రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఐటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గతంలో ఎల్‌ఐసీ గుమాస్తాగా పని చేసిన 70 ఏళ్ల విజయ్ కుమార్ 1980వ దశకంలో ‘జీవాశ్రమ్’ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తర్వాత చిత్తూరులో ‘వన్‌నెస్ యూనివర్సిటీ’ని నెలకొల్పారు. 1990లో విజయ్ కుమార్ తనను తాను ‘కల్కి’ ప్రకటించుకున్నారు. తాను విష్ణుమూర్తి పదో అవతారంగా చెప్పుకున్నారు. ఆయన ఆశ్రమాలపై బుధవారం ప్రారంభమైన ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
His story can be read below.
#####################
ఇరవైఏళ్ళ క్రితం వీడిని చూడడం కోసం జరిగిన తొక్కిసలాటలో ఏడు మంది చనిపోయారు. ఒక్కసారి వీడి ఆశ్రమంలో అడుగుపెడితే బుర్రలో గుజ్జు ఉన్న వాడెవడికైనా అది దోపిడీ అని అర్ధమవుతుంది. టికెట్ కౌంటర్ లో “టవల్” కూడా అమ్ముతారు. ఆ “టవల్” వేసుకుని మాత్రమే లోపలకి వెళ్ళాలంట. ఇంద్రభవనం లాంటి భవంతిలో కొందరు సన్యాసినిలు చిన్న చిన్న గుడ్డ గుడారాలు వేసుకుని మన సమస్యలకి పరిష్కారం చెప్తుంటారు. మనం కేన్సర్ అని చెప్పినా సరే ” మనసులో మీ భార్యకి క్షమాపణ చెప్పుకోండి ” , ” మీ అమ్మ నిద్రించేటప్పుడు పాద నమస్కారం చేసుకోండి” లాంటి పరిష్కారాలు చెప్తారు. తర్వాత ఒక చోట మన సమస్య తీరితే ఆశ్రమానికి ఎలాంటి కానుక ఇస్తామో మనసులో అనుకుంటే.. అక్కడున్న ఒక రాయి కదలడమో కదలకపోవడమో జరుగుతుంది. కదిలితే కల్కి మనం ప్రామిస్ చేసిన కానుక నచ్చి మనల్ని అనుగ్రహించాడన్న మాట. నేను కానుక సంగతి పక్కన పెట్టి మనసులో బూతులు తిట్టుకున్నాను కాబట్టి రాయి కదలలేదు.
అప్పటికప్పుడే ఒక యాభై మందిని తీసుకుని ఆ ఆశ్రమం మీద దండెత్తాలనిపించింది. కానీ నాకు అంత సైన్యం గానీ, ధైర్యం గానీ లేదు.
వీడే కాదు, వీడి లాంటి వాళ్ళు వేలమంది ఉన్నారు. వాళ్లకి కొందరు రాజకీయనాయకుల అండ ఉంటుంది. ఒక ప్రైవేట్ మాఫియా కూడా ఉంటుంది. వీళ్ళని మనలాంటి సామాన్యులు ఎదిరించి బతికి బట్టకట్టలేరు. గుంపులు గుంపులుగా ఏర్పడి సామాజిక ఉద్యమాలు చేసేవాళ్ళు మాత్రమే వీళ్ళ బతుకుల్ని బజార్లో పెట్టగలరు.
కానీ ఈ సామాజిక ఉద్యమకారులు ఇలాంటివి చెయ్యరు. రిస్కు లేకుండా మీడియా కవరేజ్ కావాలి వాళ్లకి. చలపతి రావు చతుర్లూ, బాలయ్య బరితెగింపు, రాంగోపాల్ వర్మ స్టేట్ మెంట్లూ లాంటి వాటి మీద వీరోచితంగా పోరాడుతారు లేదా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న శబరిమల ప్రాంతానికి కొండలూ, గుట్టలూ దాటి సాహసోపేతంగా దూసుకెళ్లి సంచలనం సృష్టిస్తారు. లేదా అమెరికాలో ఉన్న ఒక తలకి మాసినోడు వరంగల్లో ఉన్న మరొక తలకి మాసిన దాన్ని ఫేస్బుక్ లో బూతులు తిట్టాడని వందలమంది బోకుల్ని ఏకం చేసి వాడి ఉద్యోగం పీకించడానికి సంతకాల ఉద్యమం చేస్తారు. ఏ మాత్రం రిస్కు లేకుండా సంపూర్ణమైన మజానిచ్చే ఉద్యమాలు ఇవి.
సామాన్యులని విడగొట్టి వాళ్ళ మధ్యలో దూరి పంచాయితీలు చెయ్యడం మానేసి దోపిడీ రాజకీయనాయకులూ, అవినీతి అధికారులూ, దొంగ స్వాములూ, పాస్టర్ల మీద పోరాటం చేసి మా లాంటి సామాన్యుల ఆరాధనని తిరిగి పొందాలని ఈ సామాజిక ఉద్యమకారుల్ని నేను ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి పోరాటానికి మీకు మతవాదులు నుంచి కూడా ప్రతిఘటన రాదు. వాళ్లకి కూడా ఈ దొంగ స్వాములు, దొంగ పాస్టర్లు అంటే కోపమే. మరీ అస్సలు ప్రతిఘటన రాకపోతే మజా ఏముంటుంది అంటారా? ఒక్కసారి అన్నివర్గాలూ మెచ్చుకునే పని ఒకటి చేసి చూడండి. అది ఇచ్చే మజా ఇంకేదీ ఇవ్వదని నా నమ్మకం.