ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖలో పొత్తుల యవ్వారం తలకాయ నొప్పిగా మారింది. కమలం పార్టీ అగ్రనేతలు చేస్తున్న పొంతన లేని వ్యాఖ్యలు గందరగోళానికి తెరలేపాయి. మోడీతో తలగోక్కుని 2019 ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్నామని విశాఖలో బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భాజపా అగ్రనేతల మధ్య వైరానికి గీతాలాపన చేస్తున్నాయి. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో జగన్ ఎక్కడ రాజకీయంగా లాభపడతాడన్న భయంతో బాబు ముందుగానే కేంద్రంపై యుద్ధం ప్రకటించి నష్టపోయారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్రాన్ని ఎదిరించామే తప్ప, మోదీతో ఎలాంటి విభేదాలు లేవన్న చంద్రబాబు వ్యాఖ్యలు టిడిపిని మళ్లీ బిజెపికి దగ్గర చేస్తాయనే వాదనలకు తెరతీస్తోంది.
టిడిపితో పొత్తు వద్దని, ఒంటరిగానే పోటీ చేద్దామన్నది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతల వాదన. మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా టిడిపి ఏ ముఖం పెట్టుకుని పొత్తుకు వెంపర్లాడుతుందని నిలదీశారు. ఏపీ భాజపా ఇన్ఛార్జి దియోధర్ అయితే తొలి నుంచి బాబుపై విరుచుకుపడుతున్నారు. బాబును త్వరలో జైలుకు పంపిస్తారని పదే పదే చెబుతున్నారు. నిజానికి దియోధర్ వైఖరి రాష్ట్ర నేతలకు రుచించడం లేదు. పార్టీ బలోపేతానికి కృషి చేయవల్సింది పోయి ఓ రాష్ట్ర నాయకుడి మాదిరి ఆయన ప్రకటనలు జారీ చేయడం కమలనాథులకు మింగుడుపడటం లేదు. ఆయన పర్యటన ఖర్చుల భయానికి నేతలు దడిసిపోతున్నారు. ఆయన్ను “హైక్లాస్ ఇన్ఛార్జిగా” పిలుచుకుంటున్నారు.
నాణేనికి మరోవైపు యు.పి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న ప్రకటనలు కూడా, నేతలను గందరగోళంలోకి నేడుతున్నాయి. ఢిల్లీలోమే ఎక్కువ సమయం గడిపే ఆయనకు జాతీయ సమస్యలపై ఉన్న అవగాహన రాష్ట్రంపై లేదంటున్నారు. అందరిది ఓ దారి. వెర్రి మల్లనది మరో దారి అన్నట్టు ఏపీ భాజపా వైకాపాపై విమర్శలు సంధిస్తుంటే జీవీఎల్ మాత్రం తెదేపా గత పాలన వైఫల్యాలను ఇంకా చప్పరిస్తూనే ఉన్నారు.
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా కన్నా లక్ష్మీనారాయణ,పురంధీశ్వరితో పాటు వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇదంతా పుట్టినిల్లు తెదేపాపై సానుభూతి అని భాజపాలో టాక్. టిడిపితో పొత్తుపై ఇటీవల జీవీఎల్, సుజనా చౌదరి, దియోథర్ చేసిన పరస్పర భిన్న వ్యాఖ్యలు పార్టీలో గందరగోళం సృష్టించాయి. టిడిపి బిజెపితో పొత్తు కోరుకుంటే, ఆ మేరకు చంద్రబాబు తనకు లేఖ ఇస్తే దానిని తాను నాయకత్వం వద్దకు తీసుకువెళతానని సుజనా చౌదరి చెప్తుంటే, జీవీఎల్ మాత్రం తెదేపాను భాజపాలో విలీనం చేస్తేనే పొత్తు మాటలు ఉంటాయని ఖరాఖండీగా చెప్పేశారు.
ఏదేమైనా టిడిపితో పొత్తు వ్యవహారంపై బిజెపిలో ముందస్తు కలకలం రేగడం పార్టీకి మంచిది కాదంటున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన అగ్ర నేతలే స్పష్టత లేకుండా మాట్లాడితే ద్వితీయ శ్రేణి నేతలు ఎవరని నమ్మాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.