ScienceAndTech

ఒత్తిడి ఉపశమనానికి ఫేస్‌బుక్

Facebook Aids In Relieving Stress For Daily Wagers

ఫేస్‌బుక్‌ లేకపోతే చాలామందికి పూట గడవని రోజులివి! పని ఒత్తిడి ఎంతగా ఉన్నా.. వీలు చూస్కొని కాసేపైనా అందులో విహరిస్తుంటారు. తమకు నచ్చినవి పోస్ట్‌ చేస్తుంటారు. కొందరికి ఫేస్‌బుక్‌ వినియోగం దాదాపు ఓ ‘వ్యసనం’గా మారుతోందంటే అతిశయోక్తి కాదు! జర్మనీకి చెందిన పరిశోధకులు ఈ సామాజిక మాధ్యమం వాడకానికి సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికర అంశాలను గుర్తించారు. రోజువారీ పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు ఫేస్‌బుక్‌ను సాధనంగా ఉపయోగించుకుంటున్నారని వారు వెల్లడించారు. అది తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చినా…దీర్ఘకాలంలో వ్యసనంగా మారుతోందని హెచ్చరించారు. తమ అధ్యయనంలో భాగంగా జర్మనీ, అమెరికాలో భిన్న వయసు వ్యక్తుల తీరును పరిశోధకులు విశ్లేషించారు. ముఖ్యంగా రోజువారీ పని ఒత్తిడికి గురవుతున్నవారు, కుంగుబాటు లక్షణాలు ఉన్నవారు ఫేస్‌బుక్‌ను వినియోగిస్తూ తాత్కాలికంగా తమ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించారు. అయితే, క్రమంగా అది ‘ఫేస్‌బుక్‌ వ్యసన రుగ్మత(ఎఫ్‌ఏడీ)’కు దారితీస్తోందని.. దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్ధారించారు.